అలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది : విజయశాంతి
Vijayashanti Fires On KCR. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉందని
By Medi Samrat Published on 29 Nov 2020 6:59 AM ISTజీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉందని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ఒక బక్క జీవి అయిన కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమంది కేంద్రమంత్రులు రావాలా? అని సీఎం గారు ప్రశ్నించారని.. కేసీఆర్ గారి మాటలు వింటుంటే.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కూడా, కంటికి కనిపించని చిన్న సూక్ష్మజీవినైన నన్ను నివారించడానికి ప్రపంచంలోని ఇన్ని దేశాలు కలిసి పోరాడటం సమంజసమేనా? అని అడిగితే ఎలా ఉంటుందో.. తెలంగాణకు కరోనా కంటే ప్రమాదకరంగా మారిన కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడానికి చేసే ప్రయత్నాలను ఆయన తప్పుపట్టడం కూడా అదే విధంగా ఉందని విజయశాంతి అన్నారు.
ఒక దుష్టశక్తిని తుదముట్టించడానికి మంచి శక్తులన్నీ కలసి ఎంతో పోరాటం చేస్తేనే ఫలితం వస్తుందని చరిత్ర చెబుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇతర పార్టీలకు కట్టబెడితే భూమి తలకిందులైపోతుందని, అభివృద్ధి ఆగిపోతుందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మతకల్లోలాలు జరిగిపోతాయని కేసీఆర్ అరిచి గీపెడుతున్నారని.. సీఎం దొరగారు ఏ పార్టీలను ఉద్దేశించి ఇలా అన్నారో గానీ, ఆయన మాటలే గనుక నిజమైతే.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వరుసగా పలుమార్లు ఇప్పుడున్న జాతీయ పార్టీలు విజయాలు సాధించాయని అన్నారు. మరి అక్కడ అభివృద్ధి జరగడం వల్లే తిరిగి ప్రజలు ఆ పార్టీలకు పట్టం కడుతున్నారని.. కేసీఆర్ కుటుంబం చెబుతున్న విధంగా అరాచక పాలన జరిగితే దేశంలోని ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలకు తిరిగి తిరిగి అధికారం ఎలా దక్కుతుందని విజయశాంతి ప్రశ్నించారు.
Next Story