ఆ ఘనత సీఎం కేసీఆర్‌ది.. అందుకే నమ్మే పరిస్థితులు లేవు
Vijayashanti Fires On CM KCR Govt. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం నిజాయితీతో ప్రకటించినట్లయితే ఎంతైనా అభినందనీయమని
By Medi Samrat Published on 26 July 2021 4:01 PM GMTసీఎం కేసీఆర్ దళిత బంధు పథకం నిజాయితీతో ప్రకటించినట్లయితే ఎంతైనా అభినందనీయమని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. అయితే.. గతంలో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు లాంటి అనేక హామీలు తుంగలోకి తొక్కడం.. దళిత ఉపముఖ్యమంత్రులను అవమానకరంగా పదవి నుండి తప్పించడం వంటి దళిత వ్యతిరేక చర్యల దృష్ట్యా కేసీఆర్ ను నమ్మే పరిస్థితులు లేవని అమె విమర్శించారు.
కేసీఆర్.. దళిత బంధు పథకానికి కేవలం రూ.1200 కోట్లు కేటాయించి.. ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పని తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్ళ విషయంలో.. 5 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పలేదని తప్పించుకున్న ఘనత సీఎం కేసీఆర్‌ది అని.. ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇళ్ళు మొత్తం డిమాండ్‌కు చాలినన్ని కట్టలేని ఈ ప్రభుత్వం వెళుతున్న వేగానికి మరో 60 ఏళ్ళు పట్టేట్టుందని.. ప్రస్తుత దళిత బంధు పథకానికి కూడా వీరి కేటాయింపులను బట్టి చూస్తే 160 సంవత్సరాలు పట్టవచ్చని ఎద్దేవా చేశారు.
ఇక హుజురాబాద్ ఎన్నికల కోసం పైలెట్ ప్రాజెక్ట్ పెట్టినం.. ఇది పక్కాగా ఎన్నికల్లో ఓట్ల కోసమే చేస్తున్నాం.. అన్న సీఎం గారు... ఇది ఓట్ల పథకం అయినప్పుడు.. ఆ నియోజకవర్గంలోని మిగతా కులాలకు చెందిన సుమారు 70 వేల పైచిలుకు కుటుంబాలకు కూడా ఇలా 10 లక్షల చొప్పున నిధుల కేటాయింపు ఎందుకు చెయ్యలేదు? వారు మీ ప్రజలు కాదా? వారివి ఓట్లు కావా? అని ప్రశ్నించారు.
ఆయా వర్గాల ప్రజలందరూ ఈ విషయమై తమ 10 లక్షలు తమకు ఇచ్చేంతవరకూ గ్రామ గ్రామానా టీఆర్ఎస్ నేతలను నిలదీయాలని అన్నారు. స్పష్టమైన దళిత సాధికారతను, దళిత బంధును మనస్ఫూర్తిగా స్పాగతించి తీరుతామని.. అయితే, ఓట్ల పథకమన్నప్పుడు.. దానిపై హుజురాబాద్‌లో అన్ని సామాజిక వర్గాల వారికీ హక్కు ఉంటుందని విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్‌లో రాసుకొచ్చారు.