ఏదో చేయబోతున్నట్లు హైప్ క్రియేట్ చేసి అటకెక్కించారు
Vijayashanti Fires On CM KCR. రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం
By Medi Samrat Published on 12 Oct 2021 10:21 AM GMTరాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పిన బీసీ పాలసీ ఇప్పుడు పత్తా లేకుండా పోయిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. సీఎం అధ్యక్షతన అసెంబ్లీలో బీసీ ప్రజాప్రతినిధులతో మూడు రోజులపాటు ఆడంబరంగా నిర్వహించిన సమావేశాలు ఉత్త ముచ్చట్లే అయ్యాయని విమర్శించారు. బీసీ పాలసీ కోసం 2017 డిసెంబర్లో బీసీ సంఘాలతో పాటు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో భేటీ అయ్యి, మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించి, బీసీల సమస్యల పరిష్కారానికి సలహాలు, సూచనలు తీసుకుని 210 తీర్మానాలు చేసి ఆమోదించారు.
ఎడ్యుకేషన్, హెల్త్, రిజర్వేషన్లు, ఉపాధి తదితర రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకుని తీర్మానాలన్నీ అమలుచేస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి.. ఇదే అంశంపై అసెంబ్లీలో ప్రకటన చేసి.. కౌన్సిల్లో తీర్మానం చేసిన 210 తీర్మానాలు ఇప్పుడు అటకెక్కాయని ఎద్దేవా చేశారు. మాట ఇచ్చి నాలుగేండ్లయితున్నా అతీగతీ లేకుండా పోయిందని విమర్శించారు. పాలసీ వస్తే అన్ని రంగాల్లో ముందుకు వెళ్లవచ్చని భావించిన బీసీలకు నిరాశే ఎదురైందని అన్నారు. ఏదో చేయబోతున్నట్లు అప్పట్లో హైప్ క్రియేట్ చేసి 2018 ఎన్నికల్లో గెలిచాక రాష్ట్ర సర్కార్.. ఆ తీర్మానాలను మూలకు పడేసిందని అన్నారు. బీసీలను పట్టించుకోవడం పక్కన పెడితే.. ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కుల వృత్తుల పేరిట ప్రజలను మళ్ళీ పాతాళానికి నెట్టివేయడానికి టీఆర్ఎస్ సర్కార్ కుట్ర పన్నుతోందని ఫైర్ అయ్యారు. కేవలం ఓట్ల కోసం కొన్ని వర్గాల ప్రజలను మభ్య పెడుతూ నోట్లతో ఓట్లు, సీట్లు అంటూ పాకులాడుతుందని విమర్శించారు. ఇప్పుడు జరిగే హుజురాబాద్ ఉపఎన్నికలో కూడా ఎక్కువగా దళిత ఓటర్లను ప్రభావితం చేయడానికి... దళితుల అభ్యున్నతికి తాను కృషి చేస్తున్నట్లు గతంలో ఇచ్చిన హామీలైన దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేయకుండా.. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ 125 జయంతి సందర్బంగా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని చేయకుండా.. ఇప్పుడు దళిత సాధికారత అంటూ దళిత బంధు అనే పథకం పెట్టి దళితులను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇలా రాష్ట్రంలో ఉన్న ఎస్సీలను, బీసీలను రాష్ట్ర సర్కార్ మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ని గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడుతారని విజయశాంతి అన్నారు.