సంజయ్‌ని తొలగించినప్పుడే బీజేపీ పరువు పోయింది: విజయశాంతి
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి విజయశాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 3:00 PM ISTసంజయ్‌ని తొలగించినప్పుడే బీజేపీ పరువు పోయింది: విజయశాంతి
తెలంగాణ బీజేపీకి రాజీనామా చేసి ..శుక్రవారం విజయశాంతి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె పార్టీలో చేరిన రెండో రోజే కాంగ్రెస్ కీలక బాధ్యతలను కూడా అప్పజెప్పింది. అయితే.. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి విజయశాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని తొలగించొద్దని అధిష్టానాన్ని కోరామని.. కానీ ఆయన్ని తొలగించడంతోనే తెలంగాణలో బీజేపీ పరువు పోయిందని అన్నారు. అయితే.. తాను తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం, పాత మిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉందని విజయశాంతి అన్నారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని పెద్ద మాటలు చెప్పిన బీజేపీ ఆ దిశగా ఏమాత్రం చర్యలు తీసుకోలేదని చెప్పారు. అలా చెప్పడంతోనే బీజేపీలో చేరానని అన్నారు. ఆధారాలు ఉండి కూడా బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోలేదు అంటూ మండిపడ్డారు విజయశాంతి. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. అందరి ముందు విమర్శలు చేసుకుంటూ.. తెరవెనుక ఒప్పందాలు చేసుకుంటాయంటూ విజయశాంతి విమర్శలు గుప్పించారు.
బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరినీ మోసం చేస్తోందని విజయశాంతి అన్నారు. బండి సంజయ్‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవి నుంచి తొలగించాక బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు. కేసీఆర్ నాటిన ఒక విత్తనం .. బీజేపీలో బండి సంజయ్‌ని మార్చేసిందని అన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కూలిపోతుంటే బీజేపీ ఏం చేస్తోంది? అని నిలదీశారు. తనను విమర్శించే హక్కు బీజేపీకి లేదని, తానేమీ కేసీఆర్ ఇచ్చే డబ్బు కోసం పని చేసే వ్యక్తిని కాదన్నారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి.