సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఫడ్నవీస్
Uddhav Thackeray quits as Maharashtra Chief Minister.మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2022 8:16 AM IST
మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరుకుంది. బల పరీక్షకు ముందే సీఎం పదవికి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. బల పరీక్షకు సిద్దమవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన కొన్ని నిమిషాల్లోనే ఉద్దవ్ ఠాక్రే.. గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీకి తన రాజీనామాను సమర్పించారు. అంతేకాకుండా శాసన మండలి సభ్యత్వాన్ని వదులుకున్నారు. దీంతో రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కుప్పకూలింది.
విశ్వాస పరీక్షకు గవర్నర్ ఆదేశించడాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. బల పరీక్షపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో సభలో మెజారిటీ నిరూపణ కష్టమని నిర్థారించుకున్న సీఎం రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. సొంతవాళ్లే తనకు నమ్మక ద్రోహం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నంబర్ గేమ్ ఆడటం తనకు ఇష్టం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపటంలో తనకు సహకరించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు కృతజ్ఞతలు చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు శాసనసభకు వెళ్లేందుకు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని కార్యకర్తలకు సూచించారు.
ఇదిలా ఉంటే.. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు మార్గం సుగమం అయింది. ఫడ్నవీస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ కోరే అవకాశం ఉంది. 161 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ఫఢ్నవీస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఫడ్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణ గురించి ఇటు బీజేపీ నేతలతో పాటు గోవాలో క్యాంప్‌లో ఉన్న ఏక్‌నాథ్ షిండేతో సంప్రదించనున్నారు. ఇక రెబల్ ఎమ్మెల్యేలు ముంబైకి వస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.