నేడే కాంగ్రెస్‌లో చేరనున్న తుమ్మల నాగేశ్వరరావు

బీఆర్ఎస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  16 Sep 2023 1:35 AM GMT
Tummala Nageswara Rao,  Congress, Telangana, BRS,

నేడే కాంగ్రెస్‌లో చేరనున్న తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ బీఆర్ఎస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం అయ్యింది. శనివారం హైదరాబాద్‌కు ఏఐసీసీ అగ్రనేతలు రానున్నారు. రాహుల్‌గాంధీ సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశాల ప్రారంభానికి ముందే మధ్యామ్నం తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. తుమ్మలతోపాటు బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు సైతం కాంగ్రెస్‌లో చేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు తుమ్మల నివాసానికి వెళ్లి చర్చించారు. కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించారు. దానికి తుమ్మల నాగేశ్వరరావు సుముఖత తెలిపారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే.. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఆయన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో తుమ్మల ప్రాతినిథ్యం వహించిన పాలేరు టికెట్ కోసం పొంగులేటి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. దాంతో.. తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి. ఈ మేరకు ఆయన కోమటిరెడ్డిని కలిసి చర్చలు కూడా జరిపారు. ఇక అంతకుముందు బీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి సహా తదితరులు శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

కాంగ్రెస్‌లో తుమ్మల చేరిక బీఆర్ఎస్‌కు నష్టం చేకూరుస్తుందనే చెప్పాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై తుమ్మల ప్రభావం బలంగా ఉంటుంది. మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలో మంత్రి పదవులు నిర్వహించిన తుమ్మల.. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దాంతో.. అక్కడ ఆయనకు మంచి పేరు ఉంటుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ ప్రభావం నామమాత్రంగానే ఉంది. 2014లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలిచింది.

Next Story