తెలంగాణ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలకు ఆ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వీరు నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను అమిత్ షాకు నేతలు వివరించనున్నట్లుగా తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం, మోదీ టూర్ విజయవంతం కావడం సహా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలపై అమిత్ షా వారితో చర్చించనట్లు తెలుస్తోంది. ఇప్పటికే డీకే అరుణ కూడా ఢిల్లీకి చేరుకున్నారు.
ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినప్పటికీ బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌కు 96,598 ఓట్లు రాగా.. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి 86,485 ఓట్లు వచ్చాయి. సాంకేతికంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా.. నైతికంగా మాత్రం తామే గెలిచామని బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. గతంలో మునుగోడులో బీజేపీకి కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే పడగా.. ఉప ఎన్నికలో 40 శాతానికి పైగా ఓట్లు పడ్డాయని అంటున్నారు.
మరో వైపు ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు బీజేపీ శిక్షణా తరగతులు కూడా జరగనున్నాయి. మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ శిక్షణా తరగతులను ఉపయోగించుకోవాలని రాష్ట్ర నాయకత్వం బావిస్తోంది.