ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్

TRS MPs Privilege Notice on PM Modi over Telangana Formation Remark.ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న అవ‌మాన‌క‌రంగా జ‌రిగింద‌ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Feb 2022 5:18 AM GMT
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న అవ‌మాన‌క‌రంగా జ‌రిగింద‌ని పార్ల‌మెంట్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు గురువారం ప్రివిలేజ్(స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న‌) నోటీసు ఇచ్చారు. రాజ్య‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌ను క‌లిసిన టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు అంద‌జేశారు. ప్ర‌ధాని అభ్యంత‌ర‌క‌రంగా మాట్లాడార‌ని, 187వ నిబంధ‌న కింద నోటీసు ఇచ్చిన‌ట్లు ఎంపీలు చెప్పారు. నోటీసు అంద‌జేసిన వారిలో కె.కేశవ‌రావు(కేకే), సంతోష్‌కుమార్‌, సురేశ్ రెడ్డి, లింగ‌య్య యాద‌వ్‌లు ఉన్నారు.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న అవ‌మాన‌క‌రంగా జ‌రిగింద‌న్నారు. తలుపులు మూసి పేపర్ స్ప్రే కొట్టారని నాటి ఘటనలను గుర్తుచేశారు. ఎలాంటి చర్చ జరగకుండానే విభజన బిల్లును ఆమోదించారన్నారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్య‌లు తెలంగాణ‌లో దుమారం సృష్టిస్తున్నాయి. అధికార టీఆర్​ఎస్, కాంగ్రెస్​ ఇతర ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు సైతం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బుధ‌వారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాడిన‌ తెలంగాణ ప్రజలకు మోదీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ప‌లువురు టీఆర్‌ఎస్ నాయ‌కులు డిమాండ్ చేశారు.

Next Story