తెలంగాణ‌లో రాహుల్ ప‌ర్య‌ట‌న‌.. కవిత -రేవంత్ ల మధ్య ట్వీట్ వార్

TPCC President Revanth Reddy counter to MLC Kavitha.తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఏఐసీసీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2022 11:17 AM IST
తెలంగాణ‌లో రాహుల్ ప‌ర్య‌ట‌న‌.. కవిత -రేవంత్ ల మధ్య ట్వీట్ వార్

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నేడు రాష్ట్రానికి రానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖ‌రారైంది. తెలంగాణలో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై కవిత చేసిన వ్యాఖ్యలపై రేవంత్ కౌంటర్ ఇచ్చారు.

రాహుల్‌ కానీ, ఆయ‌న‌ పార్టీ కానీ ఎన్నిసార్లు పార్లమెంట్‌లో తెలంగాణ అంశాలు, హక్కులను ప్రస్తావించారో చెప్పాల‌ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రాష్ట్ర హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ పోరాడుతుంటే రాహుల్‌ ఎక్కడ ఉన్నారని నిల‌దీశారు. దేశవ్యాప్తంగా వరి కొనుగోలు విధానం ఒకేలా ఉండాలని తాము పోరాడుతున్నప్పుడు ఎక్కడికిపోయారని, తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, నిధుల గురించి టీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు విద్యాసంస్థలు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నప్పుడు ఎక్కడున్నారని ఎమ్మెల్సీ కవిత ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ఆసరా వంటి పథకాలపై ఆరా తీసి అవి తెలంగాణ ముఖ చిత్రాన్ని ఎలా మార్చాయో మీ తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల‌ను అడిగి తెలుసుకోవాల‌న్నారు. సీఎం కేసీఆర్ గారు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను స్పూర్తిగా తీసుకుని 11 రాష్ట్రాలు అమ‌లు చేస్తున్నాయి. వాటి గురించి నేర్చుకుని అర్థం చేసుకోవ‌డానికి మీకు కూడా తెలంగాణ‌కు స్వాగ‌తం' అంటూ క‌విత ట్వీట్ చేశారు.

ఎమ్మెల్సీ క‌విత ట్వీట్ల‌పై రేవంత్ రెడ్డి త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు. 'శ్రీమతి కవిత గారూ.. రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ నుండి ఇక పై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? వరి వేస్తే ఉరే అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి ఆయన ఫాంహౌస్ లో 150 ఎకరాలలో వరిపంట వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిర్చీ రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మీరు ఎక్కడ ఉన్నారు?" అని ట్విట్టస్త్రాలు సంధించారు.

'రైతుకు రూ. లక్ష రుణమాఫీ చేస్తానని మీ తండ్రి పచ్చి మోసానికి ఒడిగడితే ప్రశ్నించాల్సిన మరెక్కడ ఉన్నారు? రాష్ట్రంలో రైతులకు అవసరమైన 26 లక్షల టన్నుల ఎరువులు ఫ్రీగా ఇస్తానని మీ తండ్రి చెప్పి ఐదేళ్లవుతున్నా అర క్వింటాల్ ఎరువులు కూడా ఇవ్వలేదు..మరి మీరెక్కడ ఉన్నారు? అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యపురాసులు తడిచి రైతులు బోరున విలపిస్తున్నారు… వారి కష్టం పట్టించుకోకుండా మీరెక్కడ ఉన్నారు? ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీతో కలిసి డ్రామాలాడి ఆలస్యం చేయడం వల్ల చాలా మంది రైతులు ఇప్పటికే మద్దతు ధర కంటే చాలా తక్కువగా రూ.1400 లోపే అమ్ముకుంటున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? గ‌డిచిన ఎనిమిదేళ్లుగా మీ పార్టీ మోడీ పంచ‌న చేరి.. తెలంగాణ‌ను వంచ‌న చేశారు. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం హ‌క్కుగా రావాల్సిన కోచ్ ఫ్యాక్ట‌రీ, బ‌య్యారం ఉక్కుఫ్యాక్ట‌రీ, గిరిజ‌న యూనివ‌ర్సిటీ లాంటి ఏ ఒక్క‌టీ సాధించ‌లేని మీకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ప్ర‌శ్నించ‌డానికి సిగ్గు అనిపించడం లేదా..?' అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Next Story