టీపీసీసీ చీఫ్.. రేసులో ముందున్న కోమ‌టిరెడ్డి వెంకటరెడ్డి..?

TPCC New President. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ప‌రాజ‌యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఎంపీ ఉత్తమ్ కుమార్

By Medi Samrat  Published on  5 Dec 2020 2:57 PM IST
టీపీసీసీ చీఫ్.. రేసులో ముందున్న కోమ‌టిరెడ్డి వెంకటరెడ్డి..?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ప‌రాజ‌యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. ఉత్తమ్ రాజీనామాతో టీపీసీసీ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. రేపు సాయంత్రానికల్లా కొత్త టీపీసీసీ చీఫ్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికారిక సమాచారం అందుతోంది. టీపీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలంతా ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఆ పదవికి తాము అర్హులమంటే.. తామే అర్హులమని అంటున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవి రేసులో కాంగ్రెస్‌ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఉన్నారు.

అయితే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం పీసీసీగా ప్ర‌క‌టించ‌నున్నట్లు తెలుస్తోంది. ఆయన తెలంగాణ మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక మునిసిపాలిటీల్లో తమ అభ్యర్థులను గెలిపించిన కాంగ్రెస్ నేతగా ఉన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉత్తమ్, రేవంత్, శ్రీధర్ బాబు అంతగా ప్రభావం చూపలేకపోయారు. తమ నియోజక వర్గాల్లో సొంత ప్రాంతాల్లో తమ పార్టీ నేతలను గెలిపించుకోలేకపోయారు.

దీంతో వెంకట్ రెడ్డికే టీపీసీసీ పదవి దక్కుతుందని రాజ‌కీయ వ‌ర్గాల్లో అంచ‌నాలు ఉన్నాయి. మరీ కాంగ్రెస్ అధిష్టానం ఆ పదవి ఎవరికి కట్టబెడుతోందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.




Next Story