వచ్చే 12 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి : రేవంత్ రెడ్డి
TPCC Chief Revanth Reddy speech in Bahiranga Sabha At Kollapur. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 12 నెలల్లో కాంగ్రెస్
By తోట వంశీ కుమార్ Published on 13 March 2022 10:15 PM ISTతెలంగాణ రాష్ట్రంలో రానున్న 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో జరిగిన 'మన ఊరు-మన పోరు' బహిరంగసభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేయని పనులన్నింటినీ పూర్తి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎక్కడ ఉందని ప్రశ్నించిన వారికి కొల్లాపూర్ సభ సమాధానం చెబుతుందన్నారు.
కొల్లాపూర్ రాజావారి బంగ్లా నుంచి కృష్ణమ్మ పొంగినట్లుగా జనం తరలివచ్చారన్నారు. మొన్న వనపర్తిలో కేసీఆర్ సభ చూడండి.. నేడు కొల్లాపూర్ చూడండి. పాలమూర్‌లో కాంగ్రెస్ ఉందో టీఆర్ఎస్ ఉందో తెలుస్తోందని తెలిపారు. కొల్లాపూర్ ప్రాంగణానికి చేరుకోవడానికి 10 గంటల సమయం పట్టింది. 119 నియోజకవర్గాల్లో తిరుగుతా మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా. శ్రీశైలం ముంపు బాధితులకు ఇంకా న్యాయం జరగలేదు. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేరుస్తానని చెప్పి మోసం చేశారు. ముదిరాజ్‌లకు న్యాయం చేయలేదు. ఎస్సీ వర్గీకరణ సాధిస్తానని చెప్పి ఎస్సీలను మోసం చేశారు అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణ జరగాలంటే పాలమూరులో 14 సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే సాధ్యమవుతుందన్నారు. సోనియమ్మ ను గెలిపిస్తే సోనియమ్మ మిమ్మల్ని గెలిపిస్తదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాదాసు కురువలను ఎస్సి లలో చేర్చుతాం. వాల్మీకి బోయలకు ఎస్టీ లలో చేర్చుతాం. ఎస్సీ వర్గీకరణ చేయించి తీరుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రశాంత్ కిశోర్ సూచనలతో కేసీఆర్ కొత్త డ్రామాలు మొదలయ్యాయి. ఆస్పత్రిలోకి వెళ్తే గతంలో ఎందుకు ఫోటోలు, వీడియోలు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం సింపతీ కోసం పీకే సలహాలతో డ్రామాలు మొదలయ్యాయి. అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంకో 12 నెలలు ఓపిక పడితే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవడానికి కాంగ్రెస్ ఓటు వేయాలని రేవంత్ రెడ్డి కోరారు.