హైకమాండ్‌ ఆదేశిస్తే.. కేసీఆర్‌పై పోటీకీ నేను రెడీ: రేవంత్

కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ వెల్లడించారు.

By అంజి  Published on  26 Oct 2023 7:59 AM GMT
TPCC, Revanth Reddy , BRS, Telangana Polls, KCR

హైకమాండ్‌ ఆదేశిస్తే.. కేసీఆర్‌పై పోటీకీ నేను రెడీ: రేవంత్

కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ వెల్లడించారు. తానైనా, భట్టి విక్రమార్క అయినా పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తామని చెప్పారు. ఢిల్లీలో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్‌ మాట్లాడారు. ''కేసీఆర్‌, కేటీఆర్‌ను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నాం. కొడంగల్‌ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానించా. కొడంగల్‌కు పోటీకి కేసీఆర్‌ రాకపోతే కామారెడ్డిలో పోటీకి నేను సిద్ధం'' అని రేవంత్‌ అన్నారు. రెండింట మూడో వంతు మెజారిటీతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. రిటైర్ అధికారులను తక్షణమే తొలగించాలని చెప్పామని, రిటైర్ అధికారులతో నయా రాజాకార్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. కొందరు అధికారులు బీఆరెస్ ఎన్నికల నిర్వహణ టీమ్ లా పనిచేస్తున్నారని అన్నారు. అంజనీ కుమార్ ను, స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేయాలని స్పష్టంగా చెప్పామన్నారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని తాం చెబుతుంటే.. బీఆర్‌ఎస్‌ తమపై విష ప్రచారానికి దిగిందన్నారు.

సంక్షేమ పథకాల చెల్లింపులు నవంబర్ 2 లోగా విడుదల చేయాలని, ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్దిష్టమైన డిమాండ్ అని అన్నారు. ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు వాయిదా వేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెల్లిస్తుందన్నారు. కాంగ్రెస్ ను బూచిగా చూపి కేసీఆర్ చెల్లింపులు ఆపాలని చూస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేసినా.. బీఆర్‌ఎస్‌ని ఓటమి నుండి ఎవరూ కాపాడలేరన్నారు. మళ్లీ కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు.

నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయని, కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని అన్నారు. క్రిమినల్ కేసులు పెట్టి విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదన్నారు. డ్యామ్ సేఫ్టీ గురించిన అధికారులు నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. కేంద్రానికి.. బీఆర్ఎస్ కు ఉన్న లాలూచీ ఏంటి? అని రేవంత్‌ ప్రశ్నించారు. కేంద్రానికి ప్రొటెక్షన్ మనీ చెల్లించారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై చర్యలు తీసుకోవడంలేదని రేవంత్‌ ఆరోపించారు.

మేడిగడ్డ కాదు.. కేసీఆర్ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. హరీష్, కేటీఆర్.. బిల్లా, రంగా లాంటివారని, కేసీఆర్ చార్లెస్ శోభారాజ్ లాంటి వారు దుయ్యబట్టారు. వాళ్ళేం చేశారో చెప్పకుండా కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగుతున్నారని అన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ.. బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు అని ఆరోపించారు.

Next Story