నేడే బీజేపీ 'మునుగోడు సమరభేరి' సభ.. హాజరుకానున్న అగ్రనేత అమిత్ షా
Today BJP Munugode Samara Beri Sabha.తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక కాక పుట్టిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎవరు
By తోట వంశీ కుమార్ Published on 21 Aug 2022 8:53 AM ISTతెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక కాక పుట్టిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ పార్టీయే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ అటు పార్టీలతో పాటు ఇటు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు అన్ని ఈ ఉప ఎన్నికలో గెలిచేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానప్పటికీ కూడా అప్పుడే ప్రచారాన్ని ప్రారంభించాయి. నిన్న టీఆర్ఎస్ మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించగా.. నేడు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మునుగోడు సమరభేరీ పేరుతో సభ నిర్వహిస్తోంది.
ఈ సభకు ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అమిత్ షా సమక్షంలో ఇటీవల ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. అమిత్ షా హాజరుకానుండడంతో బహిరంగ సభకు భారీగా జనసమీకరణపై బీజేపీ నాయకత్వం దృష్టిపెట్టింది. ఉమ్మడి నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ నుంచి భారీగా ప్రజలను తరలించేందుకు కమలదళం ఏర్పాట్లు చేసింది. శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చండూరు రహదారిలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. కేంద్ర నిఘావర్గాలు సభాస్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.
అమిత్ షా ప్రసంగంపై ఆసక్తి..
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచినట్లుగానే మునుగోడులోనూ విజయం సాధించాలని కమలదళం పట్టులతో ఉంది. ఇక ప్రజాదీవెన సభలో సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ సన్నద్దమవుతోంది. మునుగోడుకు తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసింది..? ఎన్ని నిధులు ఖర్చు చేశారనే అంశాలను బహిరంగంగానే బయటపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వాడుతున్నభాష, చేస్తున్న దాడిపై అమిత్ సా సభలో తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మునుగోడులో బీజేపీ ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోయినట్లే అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా అమిత్ షా ఘాటుగా బదులిస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
అమిత్ షా షెడ్యూల్ ఇదే..
ఇక సభ కోసం రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు జరిగాయి. ముందుగా ప్రకటించిన సమయం కంటే ముందే హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ప్రత్యేక విమానంలో అమిత్ షా మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడ నుంచి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. 2.40 గంటలకు సికింద్రాబాద్‌లోని బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్తారు. 3.20 గంటలకు బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్‌లో రైతు నేలతో సమావేశమవుతారు. సాయంత్రం 4.40 గంటలకు మునుగోడులో సీఆర్ఫీఎప్ అధికారులతో సమావేశం అవుతారు. అనంతరం 5 గంటలకు మునుగోడులో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. సభ అనంతరం హైదరాబాద్‌కు వచ్చి ముఖ్య నాయకులతో గంటకు పైగా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాత్రి 9.40 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు అమిత్ షా.