పొత్తు కోసం.. బీజేపీకి చంద్రబాబు షరతు!

జనసేన పార్టీతో, బీజేపీతో పొత్తు కోసం మాజీ సీఎం ఎన్ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ విస్తృతంగా లాబీయింగ్ చేస్తోందని తెలుస్తోంది.

By అంజి  Published on  18 Aug 2023 5:57 AM GMT
Chandrababu, NDA, TDP, APNews

పొత్తు కోసం.. బీజేపీకి చంద్రబాబు షరతు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో పాటు, భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజులు విస్తృతంగా లాబీయింగ్ చేస్తోందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైన బిల్లులు, అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ, రాజ్యసభలలో బీజేపీకి బేషరతుగా మద్దతు ఇవ్వడంతో చంద్రబాబు తన వ్యూహాలను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో బాబు.. కాంగ్రెస్‌ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ జాతీయ నాయకత్వం జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్‌తో ఉందని, ఆయనకు సహాయం చేయడానికి ఎంత దూరమైనా వెళుతుందని ఆయన స్పష్టంగా గ్రహించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో బీజేపీ అధికారికంగా పొత్తు పెట్టుకోనప్పటికీ, ఆ టీడీపీతో పొత్తు కుదరక పోవడం గమనార్హం. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే మద్దతుకు.. బదులుగా వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌లో బీజేపీకి మద్దతు ఇస్తోంది. జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. బీజేపీ, వైఎస్సార్‌సీపీ మధ్య అనధికారిక సంబంధాలతో టీడీపీ అధినేత కలత చెందారని, బీజేపీ, టీడీపీ మధ్య అధికారికంగా పొత్తు పెట్టుకునే ప్రయత్నాలను విరమించుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

వైఎస్సార్‌సీపీ, టీడీపీ రెండింటితోనూ బీజేపీ తన లైన్‌ను తెరిచి ఉంచుతున్నప్పటికీ, బీజేపీ వైఎస్సార్‌సీపీతో అన్ని బంధాలను తెంచుకున్న తర్వాతనే టీడీపీ ఎన్డీయేతో పొత్తు పెట్టుకుంటుందన్న షరతును చంద్రబాబు పెట్టినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు షరతుకు బీజేపీ ఒప్పుకుంటుందా లేక రిస్క్ తీసుకునేందుకు సిద్దమవుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇటీవలి వరకు కేంద్రంలోని బీజేపీ నాయకత్వంతో వారధిని సరిదిద్దడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. తిరిగి ఎన్‌డీఏలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బీజేపీ నుంచి కనీసం బహిరంగంగా కూడా ఎలాంటి స్పందన రావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి సొంతంగా ఉనికి లేదని, అది టీడీపీకి పొత్తుకు పెద్దగా సహాయపడకపోవచ్చని చంద్రబాబుకు తెలుసు.

Next Story