టీపీసీసీ పదవి ఎవరిని వరించనుంది..? వీడని ఉత్కంఠ
Telangana Pradesh Congress Convener. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతన అధ్యక్షుడి ఎంపిక కసరత్తులు జరుగుతున్నాయి.
By Medi Samrat Published on 11 Dec 2020 7:27 AM GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతన అధ్యక్షుడి ఎంపిక కసరత్తులు జరుగుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం, జీఎచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చేందుకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది పార్టీ అధిష్టానం. ఇందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్ష పదవి మార్పుపై దృష్టి సారించింది.
దీంతో పార్టీకి నూతన అధ్యక్షుడిని నియమించడం కోసం పార్టీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరపాల్సిందిగా అధిష్టానం.. ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ను రంగంలోకి దింపింది. దీంతో మాణిక్కం ఠాగూర్ గత రెండు రోజులుగా వివిధ స్థాయి నాయకులతో చర్చలు జరుపుతూ అభిప్రాయ సేకరణ జరుపుతున్నప్పటికీ పీసీసీ ఎంపికలో ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తమకు అవకాశం కల్పిస్తే పార్టీని గాడిలో పెడతామని పలువురు నాయకులు అధిష్టానాన్ని కోరుతున్నారు.
ఇదిలావుంటే.. టీపీసీసీ అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్ల నుండి పోటీ పెరుగుతోంది. ముఖ్యంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తుండగా.. మల్కాజ్‌గిరి ఎంపీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలతోపాటు మరికొంత మంది సీనియర్ లు పీసీసీ పదవి కోసం తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు.