తెలంగాణలో హీటెక్కిన రాజ‌కీయం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

Telangana Power Politics. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో

By Medi Samrat  Published on  27 Feb 2021 2:07 PM GMT
తెలంగాణలో హీటెక్కిన రాజ‌కీయం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుపోతున్నారు. అటు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తుది జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీ బరిలో 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 93 మంది ఉన్నారు. కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఈ రెండు స్థానాలకు మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. మార్చి 17న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సురభి వాణీదేవి బరిలో ఉండగా, ఇదే స్థానం కోసం బీజేపీ నుంచి రామచంద్రరావు, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఫ్రొపెసర్‌ నాగేశ్వర్‌ పోటీ పడుతున్నారు. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రాములు నాయక్‌తో పాటు టీజేఎస్ అభ్యర్థిగా కోదండరాం, జయసారధి రెడ్డి, తీన్‌మార్‌ మల్లన్న, ప్రేమేందర్‌ రెడ్డి, రాణిరుద్రమ దేవి వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.

ఈవీఎంలకు బదులు.. పోస్టల్‌ బ్యాలెట్‌

ఈ ఎన్నికల్లో కరోనా మహమ్మారి కారణంగా ఈవీఎంలకు బదులు పోస్టల్‌ బ్యాలెట్‌లను ఉపయోగిస్తోంది ఈసీ. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో బరిలో ఉండటంతో పోస్టల్‌ బ్యాలెట్‌లో ప్రియారిటీ సమయంలో ఓటర్లు కొంత తికమక పడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌ త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఎవరికి వారు ఆన్‌లైన్‌లో ప్రచారం నిర్వహించుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్‌ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో గట్టి దెబ్బ తగలడం, అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తగిన మెజార్టీ రాకపోవడంతో ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఎలాగైన తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
Next Story