కాంగ్రెస్‌లో అగ్గిరాజేసిన మైనంపల్లి, వారసత్వ టికెట్ల లొల్లి షురూ

తెలంగాణలో ఎన్నికల హీట్‌ మొదలైంది. కాంగ్రెస్‌లో మైనంపల్లి చేరికతో వారసత్వ టికెట్ల లొల్లికి ఆజ్యం పోసినట్లైంది.

By Srikanth Gundamalla  Published on  10 Oct 2023 2:30 PM IST
Telangana, Elections, war, congress, heritage tickets,

 కాంగ్రెస్‌లో అగ్గిరాజేసిన మైనంపల్లి, వారసత్వ టికెట్ల లొల్లి షురూ

తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్‌ వచ్చేసింది. ఇప్పటికే అధికారపార్టీ బీఆర్ఎస్‌ దాదాపు 95 శాతం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల వంతు ఉంది. బీఆర్ఎస్‌లో టికెట్‌ దక్కినా తన కుమారుడికి టికెట్‌ కావాలంటూ మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అయితే.. మైనంపల్లి చేరికతో కాంగ్రెస్‌లో ఒకే కుటుంబానికి రెండు టికెట్ల పంచాయితీ మొదలైంది. మొన్నటి వరకు కాంగ్రెస్‌ అధిష్టానం ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను సాకుగా చూపుతూ ఒకే కుటుంబం-ఒకే టికెట్‌ అంటూ చెప్పుకొచ్చింది. కానీ.. మైనంపల్లి చేరికతో ఆ డిక్లరేషన్‌పై యూటర్న్‌ తీసుకున్నట్లు అర్థం అవుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి మైనంపల్లి హన్మంతరావు చేరికే ఆజ్యం పోసిందని చెబుతున్నారు పలువురు నాయకులు.

కాగా.. బీఆర్ఎస్‌ నుంచి మైనంపల్లికి టికెట్‌ దక్కింది.. అయినా తన కుమారుడి రోహిత్‌కు టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటానని చెప్పాడు. అధిష్టానం ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. తన కుమారుడికి టికెట్‌ ఇస్తేనే కాంగ్రెస్‌లో చేరుతానని కండీషన్ పెట్టినట్లు తెలిసింది. ఆయన చేరికతో ఉదయ్‌ఊర్‌ తీర్మానానికి చెక్‌ పెట్టినట్లు అయ్యింది. మైనంపల్లిని సాకుగా చూపుతూ కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లు తమకు, తమ వారసులకు టికెట్లు అడుగుతున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనతో పాటు తన భార్య పద్మావతి రెడ్డి, జానారెడ్డి తాను ఎంపీగా పోటీ చేస్తూ.. తన ఇద్దరు కుమారులు జైవీర్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డికి టికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు. ఇక మల్లు రవి తన కుమారుడికి, కొండా మురళి తనతో పాటు తన భార్య కొండా సురేఖకు, కూతురు కొండా సుష్మితకు టికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు.

పీజేఆర్ కుటుంబం నుంచి విష్ణు, విజయ, ఎమ్మెల్యే సీతక్క తనతో పాటు తన కుమారుడు సూర్యకు టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని అడుగుతున్నారు. బలరాం నాయక్‌ తనతో పాటు కొడుకు సాయిశంకర్‌కు, మల్‌రెడ్డి రంగారెడ్డి తన కుమారుడు అభిషేక్‌ రెడ్డి కోసం టికెట్ కోరుతున్నారు. దామోదర రాజనర్సింహ, అంజన్‌కుమార్‌ కూడా తమ సంతానానికి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. పార్టీ సీనియర్‌ నాయకులతో పాటు ముఖ్య నేతలు కూడా ఇలా రెండేసి టికెట్లు అడగడం కాంగ్రెస్‌లో సంచలనంగా మారింది. కొత్త చేరిన వారికే రెండేసి టికెట్లు ఇస్తే మా సంగతేంటని సీనియర్లు ప్రశ్నించారు. వారి ప్రశ్నలక సమాధానం చెప్పలేక కాంగ్రెస్‌ అధిష్టానం తలొగ్గినట్లు సమాచారం. అయితే.. కాంగ్రెస్‌లో ఉన్న పలువురు సీనియర్ నేతలతో పాటు.. వారి వారసత్వానికి ఈసారి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఎవరెవరి కోరికను పరిగణనలోకి తీసుకుని టికెట్లు రెండేసి కేటాయించారనేది తేలాలంటే కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి.

Next Story