ఉత్కంఠ తర్వాత బీఎస్పీ నుంచి నీలం మధు నామినేషన్

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  10 Nov 2023 8:32 AM GMT
telangana, elections, patancheru, neelam madhu, bsp,

ఉత్కంఠ తర్వాత బీఎస్పీ నుంచి నీలం మధు నామినేషన్

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొందరికి ప్రధాన పార్టీలు ముందగానే టికెట్‌ ఇచ్చినా.. ఆ తర్వాత అభ్యర్థులను మారుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పటాన్‌చెరు నియోజవర్గంలో రాజకీయం రసకందాయంగా కొనసాగింది. ఇక్కడి స్థానిక నేత నీలం మధు రాజకీయ పరిణామాల మధ్య ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. అటు తిరిగి.. ఇటు తిరిగి చివరకు ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు.

అయితే.. పటాన్‌చెరు స్థానిక నేత నీలం మధు తొలుత బీఆర్ఎస్‌లో ఉన్నారు. అయితే.. బీఆర్ఎస్ నుంచి పటాన్‌చెరు టికెట్‌ తనకే లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే.. అధిష్టానం మాత్రం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికే టికెట్‌ కేటాయించింది. దాంతో.. నీలం మధు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్‌ పార్టీని వీడారు. ఆ తర్వాత నీలం మధు కాంగ్రెస్‌, బీజేపీలో టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ పార్టీలు కూడా ఆయన్ని ఆహ్వానించాయి. కానీ.. తనకు పటాన్‌చెరు టికెట్‌ కేటాయిస్తేనే వస్తానని పట్టుబట్టారు. చివరకు ఆయన డిమాండ్‌కు కాంగ్రెస్‌ ఒప్పుకుని హామీ ఇచ్చింది. దాంతో.. కొద్ది రోజుల క్రితమే నీలం మధు కాంగ్రెస్‌లో చేరారు.

అయితే.. కాంగ్రెస్‌ కూడా ఆయనకు టికెట్‌ ఇచ్చినట్లే అంటూ ప్రకటన చేసి.. పెండింగ్‌లో పెట్టింది. నీలం మధుకు టికెట్‌ ఇస్తామనడాన్ని ఆ పార్టీ మరో నేత కాటా శ్రీనివాస్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. తొలి నుంచీ పార్టీలో కష్టపడిన తమకు కాకుండా కొత్తగా చేరిన వ్యక్తికి టికెట్‌ ఖరారు చేయడమేంటని పార్టీ పెద్దలను నిలదీశారు. గాంధీ భవన్‌ వద్ద ఆందోళనలు కూడా నిర్వహించారు. ఇక గురువారం రాత్రి ప్రకటించిన జాబితాలో పటాన్‌చెరు టికెట్‌ను నీలం మధుకి కాకుండా శ్రీనివాస్‌కు కేటాయించింది కాంగ్రెస్. దాంతో.. మరోసారి టికెట్‌ ఆశించి నీలం మధు భంగపడ్డారు. తీవ్ర అసహనానికి గురైన ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. నమ్మించి మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు.

పటాన్‌చెరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని చెప్పారు నీలం మధు. కాంగ్రెస్‌ను ఓడించాలంటూ తన అనుచరులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ పటాన్‌చెరు అభ్యర్థి నందీశ్వర్‌ గౌడ్.. నీలం మధుని కలిశారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. దానికి నీలం మధు నిరాకరించారు. రసవత్తర రాజకీయాల నడుమ నీలం మధు చివరకు బీఎస్‌పీ పార్టీలో చేరారు. దాంతో.. ఆ పార్టీ ఆయనకు బీఫామ్‌ అందించింది. అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తూ నీలం మధు నామినేషన్ దాఖలు చేశారు. ఎట్టకేలకు బీఎస్‌పీ తరఫున పటాన్‌చెరు నుంచి పోటీలో నిలబడ్డారు.

Next Story