బీఆర్‌ఎస్‌ స్వేద పత్రంపై డిప్యూటీ సీఎం భట్టి ఘాటు విమర్శలు

తెలంగాణలో అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  26 Dec 2023 4:36 PM IST
telangana, deputy cm bhatti,  brs, ktr, harish rao,

బీఆర్‌ఎస్‌ స్వేద పత్రంపై డిప్యూటీ సీఎం భట్టి ఘాటు విమర్శలు 

తెలంగాణలో అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు.. తప్పులు ఇవేనంటూ కాంగ్రెస్‌ శ్వేతపత్రం విడుదల చేసింది. దానికి కౌంటర్‌గా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు వీటి చుట్టే తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ విడుదల చేసిన స్వేదపత్రంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు.

ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే.. బీఆర్ఎస్ స్వేదపత్రం పేరుతో దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. బావ, బావమరిది చెమట కక్కి సంపాదించారా? అని కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఏదో సాధించినట్లు బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల చేసిందని విమర్శించారు. తామేదో కష్టపడి సంపాదించినట్లు చెబుతున్నారంటూ కేటీఆర్, హరీశ్‌రావుపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆదాయమనీ.. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులను తీర్చాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వేదం చిందించాలని అన్నారు మల్లు భట్టి విక్రమార్క.

అయితే.. ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్‌గాంధీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్‌ నేతలు తిన్నవన్నీ కక్కిస్తామనీ చెప్పారని గుర్తు చేశారు మల్లు భట్టి విక్రమార్క. కచ్చితంగా ఇది చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. జ్యుడీషియల్ ఎంక్వైరీ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో పాల్గొంటారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల బకాయిలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్‌ అగ్రనేతలను కూడా కలుస్తారని సమాచారం.

Next Story