కాంగ్రెస్‌ తీరుపై హైదరాబాద్‌లో వాల్‌ పోస్టర్ల కలకలం

హైదరాబాద్‌ నగరంలో కాంగ్రెస్‌ పార్టీ తీరుపై వెలసిన వాల్‌ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  17 Sep 2023 5:25 AM GMT
Telangana, CWC Meeting, Wall Posters, Hyderabad, BRS,

 కాంగ్రెస్‌ తీరుపై హైదరాబాద్‌లో వాల్‌ పోస్టర్ల కలకలం

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో ఆ పార్టీ తీరుపై వెలసిన వాల్‌ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఉన్న స్కీమ్‌లు, తెలంగాణలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పోలుస్తూ ప్రధాన కూడళ్లలో పోస్టర్లు వెలిశాయి. 'కరప్ట్‌ కాంగ్రెస్ మోడల్.. కరెక్ట్‌ బీఆర్ఎస్‌ మోడల్' అంటూ పలువురు వాల్‌ పోస్టర్లు అంటించారు. రైతుబీమా, ఉచిత కరెంటు, వికలాంగులకు పెన్షన్లు, దళితబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో లేవని తెలుపుతున్నారు. తెలంగాణలో పాలన.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోని పాలన మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. అంతేకాదు.. అధికారం కోసం కాంగ్రెస్‌ నాయకులు అమలుకు వీలుకాని హామీలు ఇస్తున్నారని.. ఆ హామీలు వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ లేవని చెబుతున్నారు.

వాల్‌పోస్టర్లలో బీఆర్ఎస్‌ వెల్లడించిన విషయాలు:

దళితులకు ఆర్థిక సాయం:

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘడ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్‌లో సున్నా, తెలంగాణలో 10 లక్షలు

వికలాంగుల పెన్షన్:

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘడ్ లో రూ.500, హిమాచల్ ప్రదేశ్ రూ.1300, కర్నాటక రూ.1100, రాజస్థాన్ రూ.1250, తెలంగాణలో రూ.4,116

వృద్ధుల పెన్షన్:

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘడ్‌లో రూ.500, హిమాచల్ ప్రదేశ్ రూ.750-1250, కర్నాటక రూ.1000, రాజస్థాన్ రూ.1000-1250

తెలంగాణలో రూ.2016

రైతులకు బీమా పథకం:

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘడ్‌, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ లో సున్నా, తెలంగాణలో రూ.5 లక్షలు

రైతులకు పెట్టుబడి సాయం:

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘడ్‌, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ లో సున్నా, తెలంగాణలో ఎకరానికి ఏడాదికి రూ. 10,000/-

రైతులకు ఉచిత విద్యుత్:

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన చత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్ లో లేదు, తెలంగాణలో 24/7 ఉచిత విద్యుత్

తెలంగాణలో ఎన్నికల వేళ కావడంతో రాష్ట్రంలో అధిక సీట్లను గెలిచేందుకు కాంగ్రెస్‌ సన్నాహాలు చేస్తోంది. ఇతర పార్టీల నుంచి అసంతృప్తులను పార్టీలో చేర్చుకోవడంతో పాటు.. ప్రజల మధ్యకు వెళ్లే అంశాలపై కాంగ్రెస్ అగ్ర నాయకులు రాష్ట్ర నేతలకు సూచనలు చేస్తున్నారు. బీఆర్ఎస్‌ నాయకులు సీడబ్ల్యూసీ సమావేశాలను విమర్శిస్తూ ఇలా వాల్‌ పోస్టర్లతో విమర్శలు చేస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు కూడా సరైన సమాధానమే ఇస్తున్నారు.

ఇటీవల మాట్లాడిన ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా బీఆర్ఎస్‌ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో మొత్తం అవినీతిపరులే ఉన్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని పెద్ద కుంభకోణాలే జరుగుతున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ విచారణకు ఎందుకు పిలిచిందని ఆయన ప్రశ్నించారు. ధైర్యంగా మందుకు వస్తే అన్ని కుంభకోణాలపై మాట్లాడదాం అన్నారు. కేంద్రంతో ఇండియా కూటమి పోరాడుతోందని.. ఈ విషయం కవితకు తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత అదానీ గురించి ఎందుకు మాట్లాడరు అని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా నిలదీశారు.

Next Story