అలక వీడి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన వి.హనుమంతరావు
కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు.
By Srikanth Gundamalla Published on 27 March 2024 12:46 PM ISTఅలక వీడి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన వి.హనుమంతరావు
కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అందుకు గాను ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను ఆశించారు. కానీ.. ఆ టికెట్‌ను వీహెచ్‌కు ఇచ్చే ఉద్దేశంలో కాంగ్రెస్ అధిష్టానం లేదని వీహెచ్‌కు తెలిసింది. దాంతో.. ఆయన అలకబూనారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి పార్టీలో సమతుల్యం తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్‌తో మాట్లాడారు. వీహెచ్‌తో మాట్లాడాలని ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వీహెచ్‌తో మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటుఇతర నాయకులు మాట్లాడారు. పార్టీ అధినాయకత్వం మేరకే నడుచుకోవాలనీ.. పార్టీ కోసం పనిచేయాలని చెప్పారు. ఆ తర్వాత తాజాగా బుధవారం వి హనుమంతరావుని సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై వీహెచ్‌తో చర్చించారు. వీహెచ్ ఏమాత్రం బాధపడొద్దనీ.. తాను భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు రేవంత్‌రెడ్డి. దాంతో.. వి.హనుమంతరావు అలకను వీడినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 8 మందిని బుధవారమే ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో అభ్యర్థులను ఫైనల్ చేస్తారు. కాగా.. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా పాల్గొంటారు.