బీజేపీ అలా నిరూపిస్తే కరీంనగర్‌లో కాంగ్రెస్ తప్పుకుంటుంది: మంత్రి పొన్నం
తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 28 April 2024 8:15 AM GMTబీజేపీ అలా నిరూపిస్తే కరీంనగర్‌లో కాంగ్రెస్ తప్పుకుంటుంది: మంత్రి పొన్నం
తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. బీజేపీ జాతీయ నేత బండి సంజయ్ ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక.. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందంటూ విమర్శలు చేశారు. తాజాగా ఆయన కామెంట్స్‌పై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ నేత బండి సంజయ్‌కు కౌంటర్ ఇచ్చారు.
సిద్దిపేట జిల్లా కోహెడలో బీఆర్ఎస్‌కు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటాననీ బండి సంజయ్ చెప్పారని గుర్తు చేశారు. అయితే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ పదేళ్లలో ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలా నిరూపిస్తే తమ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారని మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన బండి సంజయ్.. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని అన్నారు. అలాగే మహిళలకు నెలకు రూ.2500, ఆసరా పెన్షన్ రూ.4వేలు, ఇల్లు లేని పేదలకు స్థలం, రూ.5లక్షలు, రుణమాఫీ, రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15వేలు సహా ఇతర హామీలను అమలు చేశారా అని ప్రశ్నించారు. వాటిని అమలు చేసినట్లు నామినేషన్ల ఉపసంహరణ గడువు లోపు చెబితే తాను పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇక తాజాగా ఆయన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. బీజేపీ ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసిందంటూ బండి సంజయ్‌కు కౌంటర్ వేశారు.