బీఆర్ఎస్‌ పార్టీని వీడటం కొంత బాధగానే ఉంది: కడియం శ్రీహరి

బీఆర్ఎస్ పార్టీని వీడటం కొంత బాధగానే ఉందని కడియం శ్రీహరి అన్నారు.

By Srikanth Gundamalla  Published on  2 April 2024 1:30 PM IST
telangana, congress, kadiyam srihari, comments, brs,

బీఆర్ఎస్‌ పార్టీని వీడటం కొంత బాధగానే ఉంది: కడియం శ్రీహరి 

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీని పలువురు సీనియర్ నాయకులు వీడుతున్నారు. ఇటీవలే ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి గుడ్‌బై చెప్పారు. ఆయనతో పాటు కడియం కూతురు కావ్య కూడా బీఆర్ఎస్‌ను వీడారు. కాగా..వరంగల్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యకు టికెట్‌ లభించినా కూడా ఆమె టికెట్‌ను తిరస్కరించి కాంగ్రెస్‌లో చేరారు. కాగా.. కావ్యకు కాంగ్రెస్‌ అదే స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై కడియం శ్రీహరి మాట్లాడారు.

హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని వీడటం కొంత బాధగానే ఉందని కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ పట్ల తనకు గౌరవం ఉందని చెప్పారు. అయితే.. కేసీఆర్‌పై ఎలాంటి విమర్శలు చేయదలచుకోలేదని అన్నారు. బీఆర్ఎస్‌ పార్టీ తనకు అవకాశాలు ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. వాటిని తాను కూడా సద్వినియోగం చేసుకున్నట్లు వెల్లడించారు. బీజేపీ ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలుస్తోందని అందుకే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వేధిస్తోందని అన్నారు. ఈడీ, సీబీఐ కేసులు పెట్టి అధికారం చలాయించాలని చూస్తోందని కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు.

అయితే.. కాంగ్రెస్ ఆహ్వానం మేరకు తాను, తన కుమార్తె కావ్య హస్తం కండువా కప్పుకున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని కడియం శ్రీహరి చెప్పారు. ఇక ప్రతిపక్ష పార్టీలో ఉంటే నియోజకవర్గ సమస్యలను పరిష్కరించలేమని ఆయన అన్నారు. మనవరాలి వయసు ఉన్న అమ్మాయి చేతిలో ఎర్రబెల్లి ఓడిపోవడం సిగ్గుచేటు అంటూ విమర్శలు చేశారు. అలాగే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బీఆర్ఎస్‌కు చీడపురుగులా మారాడంటూ మండిపడ్డారు. అవకాశవాది తాను కాను అనీ.. అవకాశాలే తనని వెతుక్కుంటూ వచ్చాయని కడియం శ్రీహరి అన్నారు. ఇక బీఆర్ఎస్‌ నేతలకు తనని రాజీనామా చేయాలని అడిగే హక్కు లేదని కడియం శ్రీహరి అన్నారు.


Next Story