మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి

బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గురువారం కలిశారు.

By Srikanth Gundamalla  Published on  14 March 2024 3:15 PM IST
telangana, congress, cm revanth reddy, jithender reddy,

మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి

బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గురువారం కలిశారు. హైదరాబాద్‌లో ఉన్న జితేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి జితేందర్‌రెడ్డి కలిశారు రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించారు. దీనికి జితేందర్‌రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఉన్నారు. ఇక మహబూబ్‌నగర్‌ నుంచి బీజేపీ తరఫున ఎంపీ టికెట్‌ ఆశించిన జితేందర్‌రెడ్డికి నిరాశ ఎదురైంది. ఆ స్థానం టికెట్‌ను డీకే అరుణకు ఇచ్చింది బీజేపీ. దాంతో.. కమలం పార్టీపై జితేందర్‌రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జితేందర్‌రెడ్డితో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చర్చలు జరిపారు. తాజాగా పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం అందించారు.

2019 ఎన్నికల వేళ జితేందర్‌రెడ్డి బీఆర్ఎస్‌లో ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న అయనకు బీఆర్ఎస్‌ అప్పుడు టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో.. అసంతృప్తితో బీజేపీలో చేరారు. అప్పటికే డీకే అరుణకు బీజేపీ టికెట్ ఇచ్చేసింది. దాంతో.. జితేందర్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకుండా డీకే అరుణ కోసం ప్రచారం చేశారు. స్వల్ప తేడాతో డీకే అరుణ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఎంపీ టికెట్‌ కోసం జితేందర్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఇద్దరి నేతల్లో ఒకరిని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ ఆఫర్ ఇచ్చింది. కానీ.. ఇద్దరూ దాన్ని నిరాకరించారు. మహబూబ్‌నగర్‌ నుంచి జితేందర్‌రెడ్డి కుమారుడికి అవకాశం ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతను ఓటమి పాలయ్యాడు. ఇక ఎంపీ టికెట్‌ కోసం జితేందర్‌రెడ్డి మరోసారి ప్రయత్నించారు. కానీ.. అధిష్టానం డీకే అరుణకు మరోసారి అవకాశం ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలో ఉండాలని జితేందర్‌రెడ్డి భావించారు. దాంతో.. కాంగ్రెస్‌ పార్టీ జితేందర్‌రెడ్డిని ఆహ్వానించింది. కానీ.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మహబూబ్‌నగర్‌ అభ్యర్థిగా ఇప్పటికే వంశీచంద్‌ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో జితేందర్‌రెడ్డిని మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. చర్చలు కొలిక్కి రావడంతోనే సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా గురువారం జితేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆహ్వానించారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మల్కాజిగిరి తరఫున బీఆర్ఎస్ అభ్యర్థిగా శంభీపూర్ రాజు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థిగా జితేందర్‌రెడ్డిని ఖరారు చేస్తే.. అక్కడ పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

Next Story