తెలంగాణకు ప్రధాని మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు: సీఎం రేవంత్‌రెడ్డి
భూపాలపల్లి జిల్లా రేగొండ లో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహించింది.
By Srikanth Gundamalla Published on 30 April 2024 2:00 PM GMTతెలంగాణకు ప్రధాని మోదీ గాడిద గుడ్డు ఇచ్చారు: సీఎం రేవంత్‌రెడ్డి
భూపాలపల్లి జిల్లా రేగొండ లో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కర్ణాటకకు చెంబు, ఆంధ్రప్రదేశ్‌కు మట్టి, చెంబు నీళ్లు.. ఇక తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారంటూ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు చిన్న పని కూడా చేసిపెట్టని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఓట్లు వేయాలా అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
బీజేపీ నాయకులు రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. అసలు రాముడిని అవమానించిన పార్టీనే బీజేపీ అంటూ మండిపడ్డారు. సీతారాముల కల్యాణం చేసిన తర్వాతే అక్షింతలు ఇస్తామనీ.. కానీ కల్యాణం జరక్కముందే బీజేపీ నేతలు ఇక్కడ అక్షింతలు పంచారనీ అన్నారు. తాము కూడా రాముడి భక్తులమేనని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. హిందువులను ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూస్తోన్న బీజేపీ నాయకుల పన్నాగాలను తిప్పికొట్టాలంటూ పార్టీ కార్యకర్తలు, ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు. వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు రాకుండా మోదీనే అడ్డుకున్నారంటూ ఆరోపించారు. హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారంటూ ఆవేదన చెందారు సీఎం రేవంత్‌రెడ్డి. అంతేకాదు.. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు ప్రయత్నాలు చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.