జూలైలో రేవంత్‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయం: ధర్మపురి అర్వింద్
ఐలాపూర్‌లో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 3 May 2024 1:44 AM GMTజూలైలో రేవంత్‌రెడ్డి జైలుకెళ్లడం ఖాయం: ధర్మపురి అర్వింద్
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌లో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత రాత్రి సారంగాపూర్ మండలం పెంబట్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించారు. ఈ మేరకు అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి శిక్ష తప్పదని అన్నారు. జూలైలో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని ధర్మపురి అర్వింద్ అన్నారు.
రేవంత్‌రెడ్డి ఎప్పుడు జైలుకు వెళ్తాడా అని కాంగ్రెస్‌లోని ముఖ్యనాయకులంతా ఎదురు చూస్తున్నారని ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. వారిలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారని చెప్పారు. అయితే.. జూలై 14వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు. రేవంత్ జైలుకు పోతే వారంతా సంబరాలు చేసుకుంటారని అన్నారు. అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేయలేదని అన్నారు. ఆరు గ్యారెంటీలు కాదు.. అవి ఆరు గాడిద గుడ్లు అంటూ విమర్శలు చేశారు. గాడిద గుడ్లు మోసేవారిని ఏమనాలి? ముఖ్యమంత్రి గుడ్లు మోయడం ఏంటో అంటూ ధర్మపురి అర్వింద్ విమర్శలు చేశారు.
తులం బంగారం, రూ.4వేల పెన్షన్, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, ధాన్యానికి రూ.500 బోనస్, రైతుబంధు 15వేలు, రూ.2లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఈ హామీలన్నింటినీ ఏం చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అర్వింద్ నిలదీశారు. బీజేపీ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తీసేస్తుందని కొత్త నాటకానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వలేదని చెప్పడం ఏమాత్రం సరికాదని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అన్ని కుల, మతాలకు చెందిన వారి కోసం రిజర్వేషన్లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ముస్లిం రాజ్యం అయిపోయి, దేశం మూడు ముక్కలవుతుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు.