తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్ Vs కాంగ్రెస్‌

తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ BRS నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

By News Meter Telugu  Published on  12 July 2023 1:59 PM GMT
Telangana, BRS, Congress, Free 24 Hours Electricity,

తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్ Vs కాంగ్రెస్‌

ఇటీవల అమెరికా పర్యటనలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎక్కువగా ఉన్నది చిన్న, సన్నకారు రైతులే అని.. వారికి 24 గంటల కరెంటు అవసరం లేదన్నారు. మూడు గంటల ఉచిత కరెంటు సరిపోతుందని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి కామెంట్స్‌పై బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలు 'ఖబడ్దార్‌ రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ డౌన్‌ డౌన్' అంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. ఇక ఇదే విషయంపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. కేసీఆర్ విధానం మూడు పంటలు.. కాంగ్రెస్ విధానం మూడు గంటలు, బీజేపీ విధానం మతం పేరుతో నిప్పు అంటూ ట్వీట్ చేశారు. మూడు పంటలు కావాలా.. మూడు గంటలు కావాలా..? మంటలు కావాలా? మతం పేరుతో విధ్వంసం చేసే పార్టీలు కావాలా? ఏం కావాలో తెలంగాణ రైతులు నిర్ణయించాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇక రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని రేవంత్‌రెడ్డి అనడంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్‌ అందిస్తోంతే కాంగ్రెస్‌ నాయకులకు ఎందుకు కళ్లు మండుతున్నాయని ప్రశ్నించారు. రైతులకు మంచి జరిగితే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారు అని మండిపడ్డారు. రైతులకు 3 గంటల కరెంటు మాత్రమే ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను రాహుల్‌గాంధీ సమర్ధిస్తారా అని కవిత ప్రశ్నించారు. ఏ విషయమనేది రాహుల్‌గాంధీ ప్రకటించాలని చెప్పారు. రైతుల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్‌ అని.. రాబోయే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌కు తిరుగు లేదని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు తీసుకొచ్చిందని చెప్పారు. రైతుల కోసమే కాదు.. అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణ వ్యవసాయ విజయాలు ప్రపంచ గుర్తింపు పొందాయని అన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనలేక ఒకానొక సమయంలో కేంద్రమే చేతులెత్తేసిందని అన్నారు. ఇదంతా 24 గంటల పాటు ఉచిత కరెంటు అందివ్వడం వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, ఉచిత కరెంటు అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. కానీ రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో ఉండి రైతులకు అన్యాయం చేసే విధంగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని ఆమె అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పాలనలో కరెంటు కోసం ఎన్నో గోసలు పడ్డామని గుర్తు చేశారు. అయితే.. తాజాగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసగా బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొన్నారు. నిర్మల్‌లో స్థానిక విద్యుత్‌ కార్యాలయం ఎదుట మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులు ధర్నాలు చేశారని.. ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి కూడా గురువు బాటలోనే నడుస్తున్నారని ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. కష్టపడి పంటలు పండించే రైతు కళ్లలో కాంగ్రెస్‌ పార్టీ కన్నీళ్లు తెప్పిస్తోందని అన్నారు. ఇలాంటి కాంగ్రెస్‌ తెలంగాణలో మనకు అవసరమా? కరెంటు 24 గంటల పాటు అవసరం లేదంటున్న కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు గ్రామాల నుంచి తరిమి కొట్టాలన్నారు. రైతులు తప్పకుండా కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ రియాక్షన్:

ఇదిలా వుంటే బీఆర్ఎస్‌ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. భూపాలపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిందని అన్నారు. అసలు రైతులకు ఉచిత విద్యుత్‌ అందించిన మొదటి పార్టీ కాంగ్రెస్‌దే అని అన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

టీపీసీసీ సభ్యులు సత్యానారయణరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష నుంచి దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం చెబుతున్నట్లు 24 గంటల ఉచిత కరెంటు ఎక్కడ అందుతోందని ప్రశ్నించారు. కనీసం 12 గంటల పాటు కూడా నాణ్యమైన విద్యుత్ అందించడం లేదన్నారు. తొమ్మిదిన్నరేళ్ల సుదీర్ఘ పాలనలో విద్యుత్‌ సంస్థలపై రూ.60వేల కోట్ల అపారమైన అప్పుల భారం మోపారని.. దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని సత్యనారాయణరావు అన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫమైందని విమర్శించారు.

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. రైతులను దగ్గర చేసుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్‌ తాము వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతూ నిరసనలు చేస్తోంది. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ నిరసనలను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తోంది.

Next Story