కాంగ్రెస్ సర్కార్‌ను పడగొట్టే ప్రయత్నం బీజేపీ చేయదు: బండి సంజయ్
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ బండి సంజయ్ .
By Srikanth Gundamalla Published on 25 May 2024 3:50 PM ISTకాంగ్రెస్ సర్కార్‌ను పడగొట్టే ప్రయత్నం బీజేపీ చేయదు: బండి సంజయ్
నల్లగొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలను దోచుకుని ఢిల్లీకి పంపిస్తున్నారని మండిపడ్డారు. పౌరసరఫరాల శాఖలో అతిపెద్ద కుంభకోణం జరిగిందని బండి సంజయ్ అన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై తనకు నమ్మకం ఉందనీ.. కానీ ఆయన కత్తి తీయడం లేదని బండి సంజయ్ అన్నారు. రైస్ మిల్లర్ల నుంచి ఏ నాయకుడికి ఎంత ముట్టిందో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో జరిగిన అక్రమాలు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు. పౌరసరఫరాల శాఖ నష్టాల్లో ఎందుకు ఉందో చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోము అనీ.. ఆ పని బీజేపీ అస్సలు చేయదని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌ను పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని.. ఆ చాన్స్ కాంగ్రెస్ నేతలు ఇంకొకరికి ఇవ్వరని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరిగే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా వ్యతిరేకతను మూటగట్టుకుందనీ.. ఇక ఆ పార్టీ నేతలు కూడా గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయని బండి సంజయ్ అన్నారు.