బీజేపీ తీర్థం పుచ్చుకున్న తీన్మార్ మల్లన్న.. కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు
Teenmar Mallanna Joins In BJP Today.తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) క్రమంగా తన బలాన్ని
By తోట వంశీ కుమార్ Published on 7 Dec 2021 2:02 PM ISTతెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) క్రమంగా తన బలాన్ని పెంచుకుంటోంది. హుజారాబాద్ ఉప ఎన్నిక తరువాత ఆ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఇప్పటికే పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా జర్నలిస్ట్, క్యూ న్యూస్ అధినేత చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్.. తీర్మాన్ మల్లన్నకు పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. చింతపండు నవీన్‌నే ప్రజలు తీర్మాన్ మల్లన్నగా చేశారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలను అమరవీరుల స్థూపానికి కట్టేస్తానని అన్నారు. ప్రపంచంలోని అత్యంత మోసకారి వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. తనపై 38 కేసులు పెట్టి కేసీఆర్ సాధించింది ఏమిటని ప్రశ్నించారు. తనపై కేసులు పెడితే.. కొందరు పోలీసులు కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడమే తన ధ్యేయమని చెప్పారు. భారతీయ జనతా పార్టీ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతానని చెప్పారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. పదవులు, సీట్ల కోసం బీజేపీలో తీన్మార్ మల్లన్న చేరలేదని కేవలం టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో అంతమొందించేందుకు చేరారని తెలిపారు. ప్రజల కోసం పోరాడం చేస్తున్న వ్యక్తి తీన్మార్ మల్లన్న అని కొనియాడారు.