ఏపీ కోసం పోరాడగల వారిని అభ్యర్థులుగా నిలబెడుతున్నాం: చంద్రబాబు
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో హీట్ పెరిగింది.
By Srikanth Gundamalla Published on 22 March 2024 8:18 AM GMTఏపీ కోసం పోరాడగల వారిని అభ్యర్థులుగా నిలబెడుతున్నాం: చంద్రబాబు
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో హీట్ పెరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ శుక్రవారం మూడో జాబితా అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేసింది. 11 అసెంబ్లీ స్థానాలతో పాటు.. 13 ఎంపీ అభ్యర్థులను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ మూడో జాబితా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈ పొత్తుపై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు.
రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీలో తాము చేరామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఇక పార్లమెంట్‌లో బలమైన గళం వినిపించేందుకు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడగల నాయకులనే టీడీపీ అభ్యర్థులుగా నిలబెడుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈసారి రాష్ట్రంలో టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఆయన అన్నారు. అధికార పార్టీ వైసీపీపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. ఈ ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందలేదన్నారు చంద్రబాబు. మెజార్టీ స్థానాల్లో టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని అన్నారు. ఇక టీడీపీ అభ్యర్థులతో పాటు.. ఉమ్మడి అభ్యర్థులను బలపరిచి సమన్వయంతో పనిచేసి టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.