షర్మిల స్పందన.. మరోసారి అదే వాదన

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించగా

By Medi Samrat  Published on  8 Aug 2023 6:50 PM IST
షర్మిల స్పందన.. మరోసారి అదే వాదన

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించగా ఆయన పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ పరిణామంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. తిరిగి పార్లమెంటు సభ్యత్వాన్ని పొందిన రాహుల్ గాంధీకి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు.

"కోట్లాది మంది ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురింపజేసేందుకు మీ అచంచలమైన ధైర్యసాహసాలు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. న్యాయం తన పని తాను చేసుకుపోతూ, అనేక హృదయాలను సంతోషానికి గురిచేసేలా ఈ తీర్పు ఇచ్చింది. మీరు మరోసారి పార్లమెంటులో అడుగుపెట్టడం వల్ల దేశ ప్రజల సమస్యలపై సుదీర్ఘ పోరాటం ఖాయమని నేను కచ్చితంగా చెప్పగలను. ఈ నేపథ్యంలో నేను అందరు నాయకులకు విజ్ఞప్తి చేసేది ఒక్కటే. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాద పునరుద్ధరణకు చేతులు కలపండి. అణచివేతకు గురవుతున్న ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని కాపాడేందుకు, పునరుజ్జీవింపజేసేందుకు జరిగే పోరాటంలో ఇది కీలక పరిణామం కావాలి. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి నా నైతిక మద్దతు తెలుపుతున్నాను" అని షర్మిల సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

గతంలో షర్మిల రాహుల్ గాంధీని పొగుడుతూ పెట్టిన పోస్టులు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అప్పట్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వాయిస్ వినిపించిన షర్మిల.. ఇప్పుడు రాహుల్ గాంధీని పొగడడంపై పలువురు విమర్శలు గుప్పించారు. అయితే షర్మిల తెలంగాణలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశాలు లేకపోలేదని కూడా ప్రచారం సాగింది. ఇప్పుడు మరోసారి రాహుల్ గాంధీపై ట్వీట్ వేయడం హాట్ టాపిక్ గా మారింది.

Next Story