Telangana: జనసేనలో చేరిన సీరియల్ నటుడు సాగర్.. ఎన్నికల్లో పోటీ..!
తెలంగాణలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 6 Nov 2023 5:15 PM IST
Telangana: జనసేనలో చేరిన సీరియల్ నటుడు సాగర్.. ఎన్నికల్లో పోటీ..!
తెలంగాణలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. దాంతో.. ఆయా నియోజకవర్గాల్లో కొన్ని పార్టీలకు మైనస్ అవుతుంటే.. చేరికలు జరుగుతున్నవారికి మాత్రం ప్లస్ అవుతోంది. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కూడా పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. కొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. బీజేపీతో పొత్తు సర్దుబాటులో భాగంగా 9 స్థానాలను జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే.. జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామం జరిగింది. పలువురు ప్రముఖులు జనసేన కండువా కప్పుకున్నారు. మొగలి రేకులు టీవీ సీరియల్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాగర్ జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. సాగర్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సాగర్‌తో పాటు మరికొందరు కూడా జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కొత్తగూడెం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త లక్కినేని సురేందర్ రావు, అదే జిల్లాకు చెందిన ముయ్యబోయిన ఉమాదేవి, ఆమె భర్త నాగబాబు కూడా జనసేనలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన సాగర్.. పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఆయన ప్రజా పోరాటాలు తనను ఆకర్షించాయని చెప్పారు. పార్టీలో తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు సాగర్.
ఇక సాగర్ జనసేన పార్టీ తరఫున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామగుండం నుంచి ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సాగర్ రామగుండం నియోజకవర్గానికి చెందినవాడు. అంతేకాదు.. ఆయనకు జనాల్లో మంచి పాపులారీటీ ఉంది. ఇక జనసేన పార్టీ ఫేమ్.. పవన్ కళ్యాణ్ మద్దతు ఉంది కాబట్టి ఓట్లు పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. బీజేపీతో జనసేన పొత్తు ఉన్న సందర్భంగా రామగుండం స్థానాన్ని జనసేనకు కేటాయిస్తుందో లేదా చూడాలి.
జనసేన తెలంగాణ విభాగంలో ప్రముఖుల చేరిక pic.twitter.com/YV1z1zOXu2
— JanaSena Party (@JanaSenaParty) November 6, 2023