శశికళ జైలు నుండి విడుదలవ్వడంతో తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో మలుపులు తిరుగుతాయని భావించారు. తమిళనాడు గడ్డపై అడుగుపెట్టిన శశికళ అన్నాడీఎంకే పార్టీ తనదేనని కూడా ప్రకటనలు చేశారు. అయితే ఊహించని విధంగా బుధవారం నాడు ఆమె నుండి ప్రకటన వచ్చింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు శశికళ సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. "నేనెప్పుడూ అధికారంలో లేను. జయ బతికున్నప్పుడు కూడా నేను ఎలాంటి పదవుల్లో లేను. ఆమె చనిపోయిన తర్వాత కూడా అధికారం చేపట్టాలని, పదవిని అధిష్ఠించాలని కోరుకోలేదు. ఇప్పుడు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. ఆమె పార్టీ గెలవాలని ప్రార్థిస్తున్నానని.. జయలలిత ఘనమైన వారసత్వం కొనసాగాలని ఆశిస్తున్నాను" అంటూ శశికళ తన లేఖలో చెప్పారు. తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో శశికళ ఈ ప్రకటన చేసి తన అనుచరులకు కూడా ఊహించని షాక్ ఇచ్చింది.

తాను ఇక రాజకీయాల్లో ఉండబోనని శశికళ తమిళనాడు ప్రజలకు షాక్ ఇచ్చింది. శశికళ నిర్ణయం వెనుక బీజేపీ వ్యూహం ఉందని అంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుందని, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మరోమారు అధికారంలోకి వస్తుందని పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ దశలో శశికళ తిరిగి రాజకీయాల్లో కొనసాగితే అన్నాడీఎంకేలో చీలిక రావడం ఖాయమని భావించిన బీజేపీ, అన్నాడీఎంకే విడిపోకుండా ఉండాలంటే, తాత్కాలికంగా శశికళను రాజకీయాలకు దూరంగా ఉంచాలని భావించి ఆ వైపుగా పావులు కదిపారని అంటున్నారు. గత నెలలో అమిత్ షా తమిళనాడులో పర్యటించిన సమయంలోనే దీనిపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story