తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుండో ఒక వర్గానికి.. మరో వర్గానికి పొసగని విషయం తెలిసిందే..! ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా మైనస్ అయ్యాయి. తాజాగా తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పందించారు. ముఖ్యంగా కొందరు నాయకులపై సీరియస్ కూడా అయినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలను నాలుగు గోడల మధ్యే చర్చించాలని, మీడియాతో మాట్లాడే వారు పార్టీకి నష్టం చేసినట్లేనని అన్నారు. ఆ పని అసలు చేయవద్దని హెచ్చరించారు. ప్రజల్లో ఉండే వారికే టిక్కెట్లు ఇస్తామని, హైదరాబాద్‌లో కూర్చోవద్దని, ఢిల్లీకి అసలే రావొద్దని తేల్చి చెప్పారు.
పనిచేసిన వారికే పార్టీ టికెట్లు దక్కుతాయని, పనిచేయని వారిని పక్కనపెట్టేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మెరిట్ ఆధారంగానే పార్టీ టికెట్లను కేటాయిస్తామని, ప్రజలు, రైతుల పక్షాన పోరాటం సాగించిన వారికే టికెట్లు ఇస్తామని అన్నారు. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడాను చూడబోమని స్పష్టం చేశారు. ప్రజల్లో ఉండే వారికే టిక్కెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో కూర్చోవద్దని, ఢిల్లీకి అసలే రావొద్దని స్పష్టంగా చెప్పారు. వరంగల్ డిక్లరేషన్‌ను రాబోయే 30 రోజుల్లో ప్రతి గ్రామంలోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని, 12 ఏళ్ల కుర్రాడికి కూడా అందులోని అంశాలను వివరించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు.