ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తాం: రాహుల్‌గాంధీ
ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి రోజున అగ్ర నాయకులంతా జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
By Srikanth Gundamalla Published on 11 May 2024 9:52 AM GMTఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తాం: రాహుల్‌గాంధీ
ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి రోజున అగ్ర నాయకులంతా జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా కడపలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తరఫున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద వైఎస్ షర్మిలతో కలిసి రాహుల్‌గాంధీ నివాళులు అర్పించారు. తండ్రితో ఉన్న సమయంలో జ్ఞాపకాలను షర్మిల రాహుల్‌కు వివరించారు. రాహుల్‌గాంధీ షర్మిలతో పాటు వైఎస్సార్ సమాధి వద్ద కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. ఈ మేరకు మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదాను కల్పిస్తామని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని అన్నారు. రైతాంగానికి నీళ్లు ఇచ్చి.. కడప స్టీల్ ప్లాంట్‌ను కూడా పునరుద్దరిస్తామని చెప్పారు. ఏపీ ప్రజలకు సంక్షేమాన్ని అందించగల ఏకైక పార్టీ కాంగ్రెస్సే అని రాహుల్‌గాంధీ చెప్పారు.
ఏపీలో ఉన్న గత ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ వద్ద పదేళ్ల పాటు మోకరిల్లాయంటూ రాహుల్‌గాంధీ మండిపడ్డారు. అందుకే ప్రత్యేక హోదా రాష్ట్రానికి రాలేదన్నారు. పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ రాలేదని చెప్పారు. రాజీవ్‌గాంధీ, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారని రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏపీకే కాదు.. మొత్తం దేశానికి దారి చూపించిన నాయకుడంటూ కొనియాడారు. తనకు కూడా వైఎస్సార్ తండ్రిలా మార్గదర్శనం చేశారనీ.. పాదయాత్రల ద్వారానే ప్రజల సమస్యలు తెలుస్తాయని చెప్పినట్లు గుర్తు చేశారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజల వద్దకు వెళ్లాలనని.. ప్రతి చోటా వారి సమస్యలు.. ఇబ్బందుల గురించి తెలుసుకున్నట్లు రాహుల్‌గాంధీ చెప్పారు. భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి వైఎస్సార్ పాదయాత్రే అని రాహుల్‌గాంధీ అన్నారు. ఇక వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును చార్జ్‌షీట్‌లో చేర్పించింది అనే ప్రచారంలో వాస్తవం లేదని రాహుల్‌గాంధీ స్పష్టంగా చెప్పారు. కొందరు తమ స్వార్థం కోసమే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.