తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీపై తప్పించుకు తిరుగుతోంది: ప్రధాని

కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  20 Sep 2024 11:24 AM GMT
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీపై తప్పించుకు తిరుగుతోంది: ప్రధాని

కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపైనా మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందన్నారు. మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

అయితే.. దేశంలో కాంగ్రెస్‌ పార్టీని అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్‌ నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు ఉన్నది ఒకప్పటి కాంగ్రెస్ కాదనీ.. ఆ పార్టీలో దేశభక్తే లేదంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక అబద్ధమని చెప్పారు. మోసం, నిజాయితీ లేకపోవడం అన్నారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. కర్ణాటకలోనూ కాంగ్రెస్‌ రైతులను మోసగించిందన్నారు. నేటి కాంగ్రెస్ గణపతి పూజను కూడా అసహ్యించుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వాతంత్ర్య పోరాట సమయంలో బాల గంగాధర్ తిలక్ దేశ ఐక్యతను పెంచడానికి గణపతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. గణపతి ఉత్సవంలో అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు కలిసి పాల్గొంటారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వినాయకుడి విగ్రహాన్ని పోలీసు జీపులో ఎక్కించారనీ.. గణనాథుడినే అవమానించిన ఘటన అందరికీ తెలుసన్నారు ప్రధాని మోదీ. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా ఏకమై బుద్ధి చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Next Story