'సీఎం జగన్.. మా పార్టీలో చేరండి'.. అన్నీ నేను చూసుకుంటా: కేఏ పాల్
Prajashanthi Party chief KA Paul made sensational comments on CM YS Jagan. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి వచ్చారు. నేడు నవ రత్నాలు ఇవ్వడానికి మీ వద్ద డబ్బులు లేవు. ఇంకా ఆరు నెలలు
By అంజి Published on 26 July 2022 9:57 AM GMTసీఎం జగన్ తండ్రి, తల్లి తనకు ఎంతో గౌరవం ఇచ్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. సీఎం జగన్ మాత్రం తనను కలవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. సీక్రెట్‌గా అయినా ఆహ్వానిస్తే తాను వెళ్లి జగన్‌ను కలుస్తానన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్ మేలు చేయాలని కోరారు. ''అప్పులు, ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని మీకు ఇచ్చారు. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి అధికారంలోకి వచ్చారు. నేడు నవ రత్నాలు ఇవ్వడానికి మీ వద్ద డబ్బులు లేవు. ఇంకా ఆరు నెలలు ఈ పథకాలకు డబ్బు ఎలా తెస్తారు? నాతో కలవండి... పరిష్కారం చూపిస్తా. లేదా మా పార్టీ లో మీరు చేరిపోండి... నేను అన్నీ చూసుకుంటా'' అని సీఎం జగన్‌కు కేఏ పాల్ సలహా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంకా విభజన బిల్లులో అంశాలను అమలు చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం కావడానికి నలుగురు ప్రధాన కారణమన్నారు. మాజీ సీఎం చంద్రబాబు తాను చెప్పిన సలహాలను పట్టించుకోలేదని, ఆయన ప్రధానమంత్రి కావడానికి, కొడుకును సీఎం చేయడానికి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఐదేళ్లలో రాజధాని కట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదని, మోదీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించలేదన్నారు. చంద్రబాబుకు వయసు మళ్లిందని, ఇప్పుడైనా తనకు మద్దతు ఇవ్వాలన్నారు.
పాలకులు మీడియాను భయపెడుతున్నారని, అదానీ లాంటి వాళ్లు ఏకంగా మీడియాను హస్తగతం చేసుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు.. వినకపోతే చంపేవరకూ వెళ్తున్నారని.. అంతు చూస్తామని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం చనిపోతుందని ముందే చెప్పానని.. ఇప్పుడు అదే జరిగిందన్నారు. ''న్యాయ వ్యవస్థపై కూడా న్యాయమూర్తులు బయటకి వచ్చి మాట్లాడారు. కొంతమంది న్యాయ మూర్తులను బెదిరించే స్థాయికి వచ్చారు. ఈవీఎంలు అయితే బీజేపీకి 300 సీట్లు తప్పవని చెప్పాను. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు పెట్టాలని కోరా.. కానీ ఈవీఎం లతో మళ్లీ బిజెపి అధికారంలోకి వచ్చింది'' అని పాల్ పేర్కొన్నారు.
''ప్రజా శాంతిపార్టీ లో చేరేందుకు ఐఎయస్, ఐపియస్ అధికారులు ఆసక్తి చూపుతున్నారు. నేషనల్ మీడియా ఒత్తిళ్లకు లొంగి అమ్ముడుపోయింది. తెలుగు మీడియా భయపడకుండా వార్తలు ఇస్తోంది. ప్రధాని మోదీ ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తున్నారు. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది'' అని కే.పాల్ అన్నారు.
''ఈవిఎం పద్ధతి న ఓటింగ్ వద్దు.. బ్యాలెట్ విధానమే ముద్దు'' అని కేఏ పాల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. బూత్ కమిటీలు అయ్యే వరకు జిల్లాల్లో తిరుగుతానన్నారు. ఏపీకి 8 లక్షల కోట్ల అప్ప అయ్యిందని, రూపాయి పుట్టే పరిస్థితి లేదని, తెలంగాణలో 5 కోట్ల అప్పు అయ్యిందని, ఏం చేశారో తెలియదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ, కుల, కుట్ర రాజకీయాలకు చరమగీతం పాడాలన్నారు.
భారత్ మరో శ్రీలంకగా మారే ఛాన్స్ ఉందని, ప్రధాని మోదీ 76 లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మార్పు కోసం ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. దేశం, రాష్ట్రాలు ఆర్ధికంగా చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అదానీకి అన్యాయంగా ప్రభుత్వ ఆస్తులు అప్పగిస్తున్నారని మండిపడ్డారు.