ప్రధాని మోదీ తొలిసారి రాష్ట్రంలో బస - పెరుగుతున్న రాజకీయ వేడి
PM Modi Going To Stay In Hyderabad For Two Days For The First Time After Becoming Prime Minister. Hello ఇంతకాలం మండుతున్న ఎండలతో అల్లాడిపోయిన తెలంగాణ ఇప్పుడు కాస్త కుదుట పడింది.
By Nellutla Kavitha Published on 29 Jun 2022 1:56 PM GMTఇంతకాలం మండుతున్న ఎండలతో అల్లాడిపోయిన తెలంగాణ ఇప్పుడు కాస్త కుదుట పడింది. రుతుపవనాలు తీసుకొచ్చిన వర్షాలతో కొంచెం చల్లబడింది. అయితే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మాత్రం రోజురోజుకీ వేడెక్కిపోతోంది. ఈసారి బిజెపి తన జాతీయ కార్యవర్గ సమావేశాల్కు హైదరాబాద్ ను వేదికగా మలచుకోవడం ఒక కారణమైతే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో రెండు రోజులు బస చేయనుండడంఇంకొక కారణం.
ఇప్పటికే ఇటు టిఆర్ఎస్ నేతలు, అటు బిజెపి నాయకులు పరస్పర ఆరోపణలు, విమర్శలు, చర్చలు, సభలు, సోషల్ మీడియా వేదికగా చేసుకుంటారు. ఇక తాజాగా నినాదాలతో దాన్ని కాస్త తీవ్ర స్థాయికి తీసుకెళ్లారు. దాంతో రాబోయే రోజుల్లో అసలుసిసలు రాజకీయానికి తెలంగాణ వేదికగా మారబోతుంది అని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. సాలు దొర - సెలవు దొరా అంటూ బిజెపి క్యాంపెయిన్ మొదలు పెడితే, సాలు మోదీ - సంపకు మోదీ అంటూ టీఆర్ఎస్ కూడా ప్రచారం మొదలు పెట్టింది. డబల్ ఇంజన్ సర్కార్ అంటూ బిజెపి నాయకులు తెలంగాణలో బిజెపి సర్కార్ రావాల్సిన ఆవశ్యకత గురించి చెబుతూ ఉంటే, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదంటూ బై బై మోదీ అంటూ టిఆర్ఎస్ అదేస్థాయిలో క్యాంపెయిన్ కూడా చేస్తోంది.
బీజేపీకి ఇప్పటిదాకా దక్షిణాదిలో మంచి పట్టు ఉన్న రాష్ట్రం కర్ణాటక. ఆ తర్వాత ఫోకస్ పెట్టింది తెలంగాణ మీదే. దుబ్బాక ఉప ఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికలు, హుజురాబాద్ bypoll తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ రాబోయే జనరల్ ఎలక్షన్స్ గానే చూస్తోంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో కలిసివచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయని బిజెపి నాయకులు భావిస్తున్నారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి, మరీ ముఖ్యంగా అ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్ కు ఉందని, ఇక్కడ పట్టు సంపాదిస్తే తెలంగాణ సొంతమవుతుందని, సర్కార్ ఏర్పాటు చేయొచ్చనే భావన కేంద్ర నాయకత్వంలో బలంగా ఉంది.
హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ మాత్రమే కాదు పాన్ ఇండియా అని కమలనాధులు భావిస్తున్నారు. ఇక్కడున్న ఆహారపు అలవాట్లు, సంస్కృతులు, భాషలు, ప్రజలు, విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి నివసించే విధానం ఇతర నగరాల్లో ఇక్కడున్నట్టుగా ఉండదనే అభిప్రాయం వారిలో ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంశాలు, సమస్యల మీద జాతీయ స్థాయిలో సరైన ఫోకస్ రాలేదనే భావన ఇప్పటికీ కేంద్ర బిజెపి నాయకుల్లో కనిపిస్తోంది. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంతో పాటుగా, జాతీయస్థాయి నాయకులంతా హైదరాబాద్, ఇతర నియోజకవర్గాల్లో తిరగడం ద్వారా ఇక్కడి అంశాలు హైలైట్ అవుతాయని భావిస్తోంది బిజెపి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక మీద జరిగిన గ్యాంగ్ రేప్ కేసు సహా నాగరాజు మత దురహంకార హత్యలు, ఇతర లా& ఆర్డర్ ఇష్యుస్ కూడా తగినంతగా జాతీయ స్థాయిలో ఫోకస్ కాలేదని, బిజెపి తెలంగాణలో ఎంటర్ అవడం ద్వారా సోషల్ మీడియా తో పాటు మీడియా కూడా జాతీయ స్థాయిలో ఫోకస్ పెరుగుతుందని కేంద్ర నాయకత్వం భావిస్తోంది.
దీంతోపాటుగా తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన ఆవశ్యకత గురించి వివరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు నేతలు. వారసత్వం, కుటుంబ రాజకీయాలు కాకుండా పర్ఫామెన్స్ చూసుకొని మాత్రమే ఓటర్లు ఓటేస్తారని, రెండుసార్లు టిఆర్ఎస్ కు పట్టం కట్టారు కాబట్టి ఈసారి తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారని గట్టిగా చెబుతున్నారు రాష్ట్ర నాయకులు. కెసిఆర్ ను మించిన రాజకీయ చాణక్యులు జాతీయ పార్టీ అయిన బీజేపీలో ఉన్నారని, అలాంటి వారి అవసరం ఉందని ప్రజలకు చూపించగలిగితే ఒక్కసారిగా బీజేపీ వైపు ఓటర్లు మొగ్గుచూపుతారని అంచనా వేస్తున్నారు.
ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్ ను కాదని జాతీయ పార్టీ బిజెపికి తెలంగాణలో పట్టం ఎలా కడతారు? ఈ ప్రశ్న తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ ను అడిగింది న్యూస్ మీటర్. "ప్రాంతీయవాదం తో పాటుగా జాతీయవాదం కూడా ఇక్కడ ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడింది బీజేపి, మా సపోర్ట్ తోనే బిల్లు పాసయింది. ముందునుంచి చిన్న రాష్టాల ఏర్పాటుకు మేం అన్ని చర్యలు తీసుకున్నాం. తెలంగాణవాదం టీఆరెస్ సొత్తు కాదు" అంటున్నారు పోరెడ్డి కిశోర్. ఢిల్లీలో ఆప్, ఏపీలో వై ఎస్ ఆర్ సి పి, త్రిపురలో బీజేపీ, ఒక్కసారిగా ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయని, రాత్రికి రాత్రే అక్కడ పరిస్థితులు మారిపోయాయని అదే తరహా ప్రత్యామ్నాయం, పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుందని అంటున్నారు పోరెడ్డి కిశోర్. రెండు సార్లు టిఆర్ఎస్ కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి తప్పు చేసామనే భావన ప్రజల్లో ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీజేపీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారని కిశోర్ అంటున్నారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదన్న ఆలోచనలో ప్రజలున్నారని అంటున్నారాయన. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, నేతల అక్రమాల వల్లే ప్రజలు తనవైపు ఉన్నారని ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేసితీరుతామంటున్నారు పోరెడ్డి కిశోర్.
ఇక టిఆర్ఎస్ కూడా ఈ క్యాంపెయినింగ్ ల మీద అంతే తీవ్రస్థాయిలో రెస్పాండ్ అవుతోంది. మోదీని దొర తో పోలుస్తూ కెసిఆర్ ను దేవుడితో పోలుస్తున్నారు గులాబీ నేతలు. ఎనిమిది ఏళ్లలో మోడీ దేశానికి చేసిందేమీ లేదని, ప్రజలంతా బై బై మోడీ అంటున్నారని, ఈసారి మోదీకి ఎవరు ఓటేయరని, టీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. మరి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరగబోతోంది? రాజకీయాలు ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటాయి. అందులోనూ ఎన్నికల కాలం అంటే ఇక చెప్పేదేముంది! మరి ఓటర్ మదిలో ఏముంది? వేచి చూడాల్సిందే!