విపక్ష కూటమి గెలిస్తే రాముడు మళ్లీ టెంట్‌లోకి మారతాడు: ప్రధాని మోదీ

విపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

By Srikanth Gundamalla  Published on  17 May 2024 3:27 PM IST
pm modi,  congress, uttar Pradesh,

విపక్ష కూటమి గెలిస్తే రాముడు మళ్లీ టెంట్‌లోకి మారతాడు: ప్రధాని మోదీ 

దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి ఇంకా కొనసాగుతోంది. పలు విడతల్లో ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. అయితే.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకిలో పర్యటించారు. ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న విపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీతో కూడిన విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలో రామ మందిరాన్ని బుల్డోజర్‌తో కూల్చివేస్తారంటూ ఆరోపించారు. అందుకే ఇండియా కూటమికి అధికారం ఇవ్వాలా వద్దా అన్నది ప్రజలే తేల్చాలని అన్నారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే మాత్రం రాముడు మళ్లీ టెంట్‌లోకి మారతాడని చెప్పారు. అయితే.. ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ఎక్కడ బుల్డోజర్లు వాడాలి.. ఎక్కడ వాడకూడదో తెలుసన్నారు. ఈ విషయంలో ఇతర నాయకులు యోగిని చూసి నేర్చకోవాలంటూ కాంగ్రెస్‌ నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు.

కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలకు బానిసలుగా మారిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక వారి బండారం బయట పెట్టినప్పుడు హిందు-ముస్లింల విభజన చిచ్చును రేపుతున్నామని బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలో వస్తుందని దీమా వ్యక్తం చేశారు. తాను మూడోసారిగా ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటాననీ.. దీనికోసం ప్రపంచం అంతా జూన్‌ 4వ తేదీ కొరకు ఎదురుచూస్తోందన్నారు. ట్రిపుల్‌ తలాఖ్‌తో పాటు ఎన్నో సంచలన నిర్ణయాలు బీజేపీని గెలిచేలా చేస్తాయని ప్రధాని మోదీ చెప్పారు.

Next Story