Varahi Yatra: జనాల్లోకి మళ్లీ పవన్.. టీడీపీ మద్దతిచ్చే అవకాశం
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర తదుపరి దశను సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభించనున్నారు.
By అంజి Published on 17 Sep 2023 3:30 AM GMTVarahi Yatra: జనాల్లోకి మళ్లీ పవన్.. టీడీపీ మద్దతిచ్చే అవకాశం
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర తదుపరి దశను సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లాలో యాత్ర ప్రారంభం కానుందని పార్టీ ప్రకటించింది. తొలి మూడు దశల్లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నంలో కళ్యాణ్ పర్యటించారు. మొదటి దశలో గోదావరి జిల్లాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండో దశలో పశ్చిమగోదావరి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన ఆగస్టు 10 నుంచి 19 వరకు విశాఖపట్నంలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కాగా వారాహి యాత్ర తదుపరి దశ.. టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత మొదలుకాబోతున్న యాత్ర కావడంతో టీడీపీ కూడా వారాహి యాత్రకు మద్దతు తెలిపే అవకాశం ఉంది. 4 నియోజకవర్గాల్లో 5 రోజుల పాటు వారాహి యాత్ర సాగనుంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సైతం ఖరారు అయింది. అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం, కైకలూరులో పవన్ వారాహియాత్ర నిర్వహించనున్నారు. ఇప్పటికే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా కలిసొచ్చిన పార్టీలతో ముందుకు వెళ్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇటీవల రాజమహేంద్రవరం సెంట్రల్ జైలలో చంద్రబాబును పరామర్శించిన తర్వాత జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు.
పవన్ ప్రకటనతో ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది. ఈ ప్రకటన తరువాత పవన్ వారాహి యాత్ర మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీకి మరో ఆరు నెలలే సమయం ఉందని జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ అన్నారు. జగన్ మానసిక స్థితిపై సందేహాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలతో అనవసర ఈగోలకు పోవద్దని, కలసి పనిచేస్తేనే వైసీపీ తరిమికొట్టగలమని పిలుపునిచ్చారు. తెలుగుదేశంతో సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తారని తెలిపారు.