తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తోంది. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద ఆయన కుమారై షర్మిల దీనిని నెలకొల్పుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ పార్టీ(వైఎస్ఆర్టీపీ) గా నామకరణం చేశారు. నేడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సాయంత్రం పార్టీ జెండాను, ఎజెండాను ప్రకటించనున్నారు. ఇందుకు సంబందించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. షర్మిల పార్టీపై అటు ఏపీ, ఇటు తెలంగాణలో పలువురు ప్రముఖ నేతలు స్పందిస్తున్నారు. అయితే షర్మిల పార్టీపై ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు.
వైఎస్ షర్మిల పార్టీకి స్వాగతం చెబుతున్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నో పార్టీలు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉద్యమ, చైతన్య స్ఫూర్తి కలిగిన యువత రాజకీయాల్లోకి రావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారసత్వ రాజకీయాల గురించి, తెలంగాణలో పార్టీ బలోపేతంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పగటి కలలు కనే వ్యక్తిని కాదన్నారు. రాజకీయ వారసత్వంతో సంబంధం లేని వారు కూడా రాజకీయాల్లోకి రావాలని కోరారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలని అనుకున్నా.. తనకు డబ్బు బలం లేదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటన ముగించుకొని పవన్ కల్యాణ్ గురువారం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.