ఒకప్పుడు ఓ రాజకీయ నాయకుడు తనకు ప్రధానమంత్రి కుర్చీ కోసం మద్దతిస్తానని ఆఫర్ ఇచ్చాడని, అయితే ఆ ఆశయం తానేమీ పట్టించుకోలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. "నాకు ఒక సంఘటన గుర్తుంది. నేను ఎవరి పేరు చెప్పను. ఆ వ్యక్తి మీరు ప్రధానమంత్రి కాబోతున్నట్లయితే, మేము మీకు మద్దతు ఇస్తాము చెప్పాడు" అని కేంద్ర మంత్రి గడ్కరీ శనివారం నాగపూర్‌లో జరిగిన జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో అన్నారు.
“కానీ, మీరు నాకు ఎందుకు మద్దతు ఇవ్వాలి, నేను మీ మద్దతు ఎందుకు తీసుకోవాలి అని నేను అడిగాను, ప్రధానమంత్రి కావడమే నా జీవితంలో లక్ష్యం కాదు, నేను నా విశ్వాసానికి, నా సంస్థకు విధేయుడిని, దాని కోసం నేను రాజీపడను. ఏ పదవి అయినా నాకు అత్యంత ప్రధానమైనది కాదు, ఎందుకంటే నా విశ్వాసం నాకు ప్రధానమైనది, ”అని బిజెపి సీనియర్ నాయకుడు అన్నారు.
కమ్యూనిస్టు నాయకుడు ఏబీ బర్ధన్ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకి అయినప్పటికీ ఆయనను గౌరవించాలని గడ్కరీ వ్యాఖ్యానించారు. నాగ్‌పూర్-విదర్భ ప్రాంతానికి చెందిన అతిపెద్ద రాజకీయ నాయకులలో ఆయన ఒకరని, నిజాయితీ గల ప్రతిపక్షాన్ని గౌరవించాలని ఆయన అన్నారు. ఓ సీపీఐ నేతకు ఇదే విషయాన్ని చెప్పానని ప్రస్తావించారు.
నితిన్ గడ్కరీ తన ప్రసంగంలో జర్నలిజం, రాజకీయాలలో నీతి యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక, శాసనసభ మరియు మీడియా అనే నాలుగు స్తంభాలు నీతిని అనుసరించినప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందని బిజెపి నాయకుడు అన్నారు.