మునుగోడు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టేది ఎవ‌రికో..?

Only Eight days left for the Munugode By election campaign.రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేయ‌డంతో మునుగోడులో ఉప ఎన్నిక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Oct 2022 7:10 PM IST
మునుగోడు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టేది ఎవ‌రికో..?

రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు మాట్లాడే వారి దృష్టి ప్ర‌స్తుతం మునుగోడుపైనే ఉంది. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేయ‌డంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మునుగోడు అభివృద్ధిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, నిధులు ఇవ్వడం లేద‌ని, నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే తాను రాజీనామా చేస్తున్న‌ట్లు చెప్పి రాజీనామా చేసి భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ)లో చేరారు రాజ‌గోపాల్ రెడ్డి.

కేవ‌లం ఇది ఓ ఉప ఎన్నికే అయినా సాధార‌ణ ఎన్నిక‌ల కంటే కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి ప్ర‌ధాన పార్టీలు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేయ‌గా.. న‌వంబ‌ర్ 3న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ముగియ‌డంతో అన్ని పార్టీలు ప్ర‌చారంలో నిమ‌గ్నం అయ్యాయి. ఇంటింటికి ప్ర‌చారం చేయ‌డంతో పాటు ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల వార్ కూడా ఉదృత‌మైంది. నేత‌లు ప‌ర‌స్ప‌ర విమ‌ర్శలు, ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు.

టికెట్ రాలేద‌నో, పార్టీపై అసంతృప్తో తెలీదు గానీ మునుగోడు ఉప ఎన్నిక వేళ పార్టీల మార్పు రాజ‌కీయం వేగం పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు టీఆర్ఎస్‌, బీజేపీలో చేరుతుండ‌గా.. బీజేపీ నాయ‌కులు టీఆర్ఎస్‌లో, టీఆర్ఎస్ నాయ‌కులు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. నిన్న ఈ పార్టీలో ఉన్న నేత మ‌రుస‌టి రోజుకు అదే పార్టీలో ఉంటారో లేదో ప‌రిస్థితులు ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేత‌లు సైతం ప్ర‌స్తుతం మునుగోడులోనే మ‌కాం వేసి త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వినూత్నంగా ప్ర‌చారం చేస్తూ ఓట‌ర్ల‌ను ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇక.. టీఆర్ఎస్‌, బీజేపీల‌తో పోలిస్తే మిగ‌తా పార్టీలు ప్ర‌చారంలో కొంత వెన‌క‌బ‌డి ఉన్న‌ట్లు క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. దుబ్బాక, హుజురాబాద్, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక‌ల‌కు మునుగోడు చాలా తేడా ఉంద‌ని అంటున్నారు. ఆయా చోట్ల వివిధ కార‌ణాల వ‌ల్ల ఉప ఎన్నిక రాగా.. మునుగోడులో మాత్రం బీజేపీ కోరి ఉప ఎన్నిక‌ను తెచ్చుకున్న‌ట్లు చెబుతున్నారు.

ఆ పార్టీకి, వ్య‌క్తిగ‌తంగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కం. మ‌రోవైపు టీఆర్ఎస్ కూడా మునుగోడు ఉప ఎన్నిక ఓ స‌వాల్ అనే చెప్పాలి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అవినీతిలో కూరుకుపోయింద‌ని ప్ర‌తిప‌క్షాలు బీజేపీ, కాంగ్రెస్‌లు విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా.. దేశంలో ఏ ఇత‌ర రాష్ట్రాల్లో లేని సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని టీఆర్ఎస్ చెబుతూ వ‌స్తోంది. మ‌రీ సంక్షేమానికి ప్ర‌జ‌లు ఓటేస్తారా..? అన్న‌ది మ‌రి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

మ‌రో సంవ‌త్స‌రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ముందు జ‌రుగుతున్న ఉప ఎన్నిక కావ‌డంతో దీని ప్ర‌భావం తెలంగాణ మొత్తం ఉండొచ్చున‌నే అభిప్రాయంతో అన్ని పార్టీలు ఉన్నాయి. మ‌రీ మునుగోడులో గెలిచేదెవ‌రు అన్న‌దానిపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో న్యూస్ మీట‌ర్ బృందం క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి అక్క‌డి ప‌రిస్థితుల‌ను తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించింది.

- కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ప‌ట్ల‌ ప్ర‌జ‌ల్లో అభిమానం, సానుభూతి రెండూ ఉన్న‌ట్లు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఆప‌ద‌లో ఉన్నామ‌ని, త‌మ‌కు సాయం చేయాల‌ని అడిగితే వెంట‌నే సాయం చేసే వ్య‌క్తిగా పేరుంది. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తో పాటు బీజేపీ పార్టీ సానుభూతి ప‌రుల ఓట్లు త‌న‌ను గెలిపిస్తాయ‌ని రాజ‌గోపాల్ రెడ్డి ఆశిస్తున్నారు. ఒక‌వేళ గెల‌వ‌క‌పోతే మాత్రం కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితి త‌ప్ప‌దు. ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు పై ఈ ఎన్నిక ఫ‌లితం ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంది.

- నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్షేత్రస్థాయి బలాన్నే నమ్ముకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. అయితే.. ఉప ఎన్నిక నోటిఫికేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రామ, మండల స్థాయి క్యాడర్ చాలా మంది రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. దీనిలో కొంత వాస్త‌వం ఉంది. ఇది కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ‌గానే చెప్పుకోవాలి.

- 2014లో విజ‌యం సాధించిన టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో రాజ‌గోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్ర‌స్తుత ఉప ఎన్నిక‌లో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్దినే న‌మ్ముకున్నారు. కూసుకుంట్లకు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్యేలు, మంత్రులు అన్ని గ్రామాల్లో ప్ర‌చారం చేస్తూ ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధిని వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.

ప్ర‌జ‌ల్లో భిన్నాభిప్రాయాలు..

ప్ర‌జ‌ల్లో భిన్నాభిప్రాయాలు క‌నిపిస్తున్నాయి. ఇంత‌క‌ముందుతో పోలిస్తే ప్ర‌జ‌లు మ‌రింత చైత‌న్య వంతుల‌య్యారు. గృహిణులు, వేతన జీవులు, సాధారణ ఉద్యోగులు, యువత ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎప్ప‌టి నుంచో కాంగ్రెస్ పార్టీని న‌మ్ముకున్న వారు హ‌స్తం పార్టీ వైపు ఉండ‌గా, రాజ‌గోపాల్ రెడ్డిని అభిమానించే వారు మాత్రం ఆయ‌న వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. యువ‌త‌లో మాత్రం కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డికి మంచి క్రేజ్ ఉంది. చ‌దువుకున్న యువ‌త బీజేపీ అభ్య‌ర్థి వైపు మొగ్గుచూపుతుండగా, కొంత మంది మ‌హిళ‌లు, రైతులు, సాధార‌ణ ప్ర‌జ‌లు టీఆర్ఎస్ వైపు ఉన్నారు.

మామూలుగా అయితే.. పార్టీ అభిమానులు, కార్త‌క‌ర్త‌లు అయితే అదే పార్టీకి త‌ప్ప‌కుండా ఓటు వేస్తారు. అయితే.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అదే పార్టీకి ఓటు వేస్తారా..? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోవ‌డం కొంత క‌ష్టంగానే ఉంది. రోజు రోజుకు ప్ర‌జ‌ల అభిప్రాయం మారుతుంద‌నే టాక్ కూడా న‌డుస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎవ‌రు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో చెప్ప‌డం చాలా క‌ష్టం. దీంతో న‌వంబ‌ర్ 3న ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తారో చూడాల్సిందే.

Next Story