పొలిటికల్ హీట్ పెంచుతున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక
Nagarjuna Sagar Bypoll. నోముల మృతితో నాగార్జున సాగర్‌లో ఉపఎన్నిక పక్కా అయింది.
By Medi Samrat Published on 26 March 2021 4:28 PM ISTసీనియర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు నోముల నర్సింహయ్య మృతి చెందారు. ఆయన మృతికి అన్ని రాజకీయ వర్గాలు సంతాపాన్ని ప్రకటించాయి. నోముల మృతితో నాగార్జున సాగర్‌లో ఉపఎన్నిక పక్కా అయింది. ఎలక్షన్ కమిషన్ నోటీఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభమయింది. పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. ఈ నేఫథ్యంలో.. నాగార్జున సాగర్ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కాపాడుకుంటుందా..? లేదా రానున్న ఎన్నికల్లో తెలంగాణలో గద్దెనెక్కుతామంటూ.. దుబ్బాక ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. ఆ స్థానాన్ని దక్కించుకుని అసెంబ్లీలో తమ బలాన్ని మూడుకు పెంచుకుంటుందా..?.. లేక మొదటి నుండి ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ సత్తా చాటనుందా..? అనే చర్చలు జరుగుతున్నాయి.
అధికార టీఆర్ఎస్‌కు అవకాశమెంత..
నోముల నర్సింహ్మయ్య 1999,2004 లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో భువనగిరి ఎంపీగా సీపీఎం నుంచి ఓటమి చెందారు. తరువాత ఆయన 2013లో టీఆర్ఎస్ లో చేరారు. 2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు. అయితే, 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై ఘన విజయం సాధించి నోముల నర్సింహయ్య అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే మొదటి నుండి నోములకు ఉన్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్, టీఆర్ఎస్ కు ఉన్న సానుకూలత ఈ ఎన్నికలో గెలుపుకు దోహద పడ్డాయి. అయితే ఈ హఠాత్తు పరిణామం తర్వాత నియోజకవర్గంలో పోటీలో నిలిచేందుకు నోముల స్థాయిలో గుర్తింపు పొందిన నేత లేకపోవడం టీఆర్ఎస్‌కు మైనస్. అయితే.. టీఆర్ఎస్.. నోముల కుటుంబానికి సంబంధించిన వారికి టికెట్ ఇస్తుందా లేక మరే ఇతర నేతను ఎవరినైనా బరిలో ఉంచుతుందా అనే దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
అక్కడ కాంగ్రెస్‌కు అన్నీ ఆయనే..
కుందూరు జానారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితడు. కాంగ్రెస్ సీనియర్ నేత. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన జానారెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు. జానారెడ్డి సుదీర్ఘకాలం మంత్రిగా ఉండి రికార్డులు బ్రేక్ చేశారు. ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ వివాదాలు ఉండవు. శత్రువులు కూడా జానారెడ్డిని మిత్రుడుగా చూస్తారు. అలాంటి జానారెడ్డి దాదాపు రెండేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వరస విజయాలతో జానారెడ్డి ఓటమి ఎరగకుండా గెలుస్తూ వస్తున్నారు. అలాంటిది 2018 ఎన్నికల్లో జానారెడ్డి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు, పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. 2014లో గెలిచిన జానారెడ్డి సీఎల్పీ లీడర్ గా ఉండి ప్రభుత్వానికి, విపక్షానికి మధ్య పెద్దన్న పాత్ర పోషించారు. ప్రస్తుత ఉప ఎన్నికలో జానా రెడ్డి బరిలో ఉన్నారు. మొదటి నుండి ఉన్న ఇమేజ్ కలిసొస్తుందని విశ్లేషకులు అబిఫ్రాయపడుతున్నారు. ముందుగానే ప్రచార పర్వంలోకి దిగడం సానుకూలాంశం.
దుబ్బాక ఉప ఫలితం పునరావృతమయ్యేనా..
2018లో టిఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కరోనాతో మరణించడంతో దుబ్బాక ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా 23 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. మొదటి నుండి ఈ ఎన్నిక అధికార టీఆర్ఎస్‌కు, మాకు మధ్యే అని చెప్పుకొచ్చిన బీజేపీ చివరికి పైచేయి సాధించింది. అయితే నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నికలో ఇందుకు పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండనున్నాయి. అక్కడ బీజేపీకి ఉన్న బలం అంతంతమాత్రమే. లోక్‌సభ ఎన్నికలలో సత్తా చాటిన బీజేపీ.. అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నియోజకవర్గమైన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో చతికిలపడింది. నోటిఫికేషన్ వెలువడినా ఇంకా అభ్యర్ధిని ప్రకటించకపోవడంతో ఎవరు బరిలో ఉండనున్నారనేది గందరగోళంగా మారింది. అయితే.. జీహెచ్ఎంసీ, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల మాదిరే నాగార్జున సాగర్‌లో కూడా విజయఢంకా మోగిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు.
మరోవైపు ఈ ఉపఎన్నికల్లో 400 మంది అమరవీరుల కుటుంబ సభ్యులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అమవీరుల ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని.. కానీ స్వరాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకోలేదని తెలంగాణ అమరువీరుల ఫోరం మండిపడింది. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకే సాగర్‌లో నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించింది. తెలంగాణ వచ్చాక అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం, ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని..కానీ ఇప్పటి చాలా కుటుంబాలకు ఒక్క రూపాయి ఆర్థిక సాయం కూడా అమరవీరుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పటికే ఉపెన్నిక నామినేషన్ల పర్వం మొదలయింది. మార్చి 30 వరకు నామినేషన్లకు గడువు ఉంది. అయితే.. మార్చి 27, 28, 29 తేదీలను ఈసీ సెలవుగా ప్రకటించడంతో.. మార్చి 25, మార్చి 30న మాత్రమే నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అభ్యర్థులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.