త్వరలోనే మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్.. విజయం మాదేనంటున్న టీఆర్ఎస్.. తగ్గేదేలే అంటున్న కాంగ్రెస్, బీజేపీ
Munugode Bypoll Schedule announcement Soon.మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి
By తోట వంశీ కుమార్ Published on 14 Sep 2022 2:50 AM GMTమునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో మునుగోడులో విజయం సాధించి ప్రజలు తమవైపు ఉన్నారనే విషయాన్నే చాటి చెప్పాలని బావిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. ఈవీఎంలు, వీవీప్యాట్ల తనిఖీలు నిర్వహించాలని ఇప్పటికే నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ ప్రక్రియ మరో పది లేదా పదిహేను రోజుల్లో పూర్తి కానుంది. దీంతో సెప్టెంబర్ నాలుగో వారంలో మునుగోడు ఉప ఎన్నికలపై షెడ్యూల్‌పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సెప్టెంబర్ నాలుగో వారంలో నోటిఫికేషన్ వెలువడితే.. అక్టోబర్ చివరి లేదా నవంబర్ తొలి వారంలో ఉప ఎన్నిక జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
నోటిఫికేషన్ వెలువడకముందే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్లను తమ వైపుకు ఆకర్షించుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ప్రకటించగా.. బీజేపీ, టీఆర్ఎస్‌లు ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం గుర్తుపై పోటీ చేయడం దాదాపుగా ఖాయం.
ఇక టీఆర్ఎస్ ఎవరిని అభ్యర్థిగా దించుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. సరైన సమయంలో మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని సీఎం కేసీఆర్ చెబుతారనే విషయాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు పార్టీ శ్రేణులకు చెప్పారు. ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి పని చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టికెట్ దక్కుతుందని చాలా మంది బావిస్తున్నారు. అయితే.. ఆయనకు టికెట్ ఇవ్వవద్దని సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసి కోరారు.
వాస్తవానికి మునుగోడు సీటు విషయంలో టీఆర్ఎస్‌కు పెద్ద పట్టుదల అవసరం లేదు. ఎందుకంటే అది పార్టీ సిట్టింగ్ సీటుగా కాంగ్రెస్ కు, అభ్యర్థి సిట్టింగ్ సీటుగా బీజేపీకి ప్రతిష్టాత్మకం. అయితే.. రాష్ట్రంలో బీజేపీ పాగాను నిలువరించేందుకు సీఎం కేసీఆర్ పెద్ద యుద్దమే చేస్తున్న నేపథ్యంలో మునుగోడులో విజయం సాధించడం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తుందో చూడాల్సిందే.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటించగానే నలుగురిని కలుపుకుపోయే ప్రయత్నాలు ప్రారంభించారు పాల్వాయి స్రవంతి. టికెట్ ఆశించి భంగపడ్డ చల్లమల్ల కృష్ణారెడ్డితో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లను కలిసి మునుగోడులో కలిసి పని చేద్దామనే అభ్యర్థనను వారి ముందుంచారు. అయితే.. రేవంత్‌రెడ్డితో ఉప్పునిప్పుగా ఉన్న కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారానికి వస్తారా..? లేదా..? స్రవంతి విజయం కోసం ఏ మేరకు పని చేస్తారో అన్నది వేచి చూడాలి.
మరోవైపు బీజేపీ కూడా మునుగోడులో విజయం సాధించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మునుగోడే లక్ష్యంగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ప్లాన్ చేశారు. మునుగోడు నియోజకవర్గానికి దగ్గరలోనే పాదయాత్ర ముగింపు సభ జరగనుంది.