రేవంత్‌రెడ్డి సీఎం వ్యాఖ్యలపై సీతక్క వివరణ

తానా సభల్లో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. అవసరమైతే సీతక్కను సీఎంను చేస్తామని అన్నారు.

By అంజి
Published on : 12 July 2023 8:35 AM IST

Mulugu MLA Sitakka, Revanth Reddy, Congress, Telangana

Mulugu MLA Sitakka, Revanth Reddy, Congress, Telangana

తానా సభల్లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. అవసరమైతే ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎంను చేస్తామని అన్నారు. రేవంత్‌ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలను సీనియర్‌ నాయకులు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉన్న సీతక్క దీనిపై స్పందించారు. రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. ఆ టైంలో తాను పక్కనే ఉండడటంతోనే తనను చూపించారని, తాను కాకుండా మరొకరు ఉన్నా ఆయన అదే చెప్పేవారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అన్ని వర్గాలకు సమాన న్యాయం ఉంటుందని చెప్పేందుకే రేవంత్‌ అలా మాట్లాడరని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల్లోనూ తమ పార్టీ బీసీలను ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని సీతక్క గుర్తు చేశారు. అధికారంలోకి రావడమే తమ పార్టీ అంతిమ లక్ష్యమన్న సీతక్క.. పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన వారే సీఎం అవుతారని స్పష్టం చేశారు. సీఎం ఎవరైనా సరే.. అందరం కలిసే పని చేస్తామని చెప్పారు. రేవంత్‌ వ్యాఖ్యలను వివాదం చేయడం తగదన్నారు. రేవంత్‌ వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఉద్దేశం లేదన్నారు. ఎవరినో తగ్గించి.. మరెవరినో పెంచాలన్న ఉద్దేశంతో రేవంత్‌ అలా మాట్లాడలేదన్నారు. ఆ రోజు తానా సభల్లో రేవంత్‌ను ప్రశ్న అడిగిన వ్యక్తి ఎస్టీ అని, ఆ సమయంలో తాను పక్కనే ఉండడంతోనే తనను చూపించి రేవంత్ అలా అన్నారని సీతక్క అన్నారు.

అంతే తప్ప తనను సీఎం చేస్తానని అనలేదన్నారు. ఈ విషయాన్ని కొందరు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాలు కట్టిపెట్టి కలసి పనిచేద్దామని నేతలకు సూచించారు. తానా సభల్లో రేవంత్ రెడ్డిని ఎన్నారైలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. దళితులు, గిరిజనులను ముఖ్యమంత్రి కానివ్వరా? తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తే కనీసం ఉప ముఖ్యమంత్రి పదవి అయినా సీతక్కకు ఇస్తారా అని ప్రశ్నించారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్‌ సంప్రదాయం కాదన్నారు. కాంగ్రెస్‌ అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తుందన్నారు. ప్రస్తుతం రేవంత్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్‌ నేతలు మండిపడుతున్నారు.

Next Story