14న వైసీపీలో చేరుతా: ముద్రగడ
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక ఖాయమైంది. ఈ నెల 14వ తేదీన ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
By అంజి
14న వైసీపీలో చేరుతా: ముద్రగడ
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక ఖాయమైంది. ఎన్నికల్లో పోటీ చేయడంపై స్పష్టత రాకున్నా వైసీపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీన ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా తాను, తన కుమారుడు గిరి వైసీపీలో చేరుతున్నట్టు ముద్రగడ ప్రకటించారు. ఇటీవల ఉమ్మడి గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఆయనతో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ముద్రగడ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
తాడేపల్లిలో సీఎం సమక్షంలో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీగా వెళ్లి వైసీపీలోకి జాయినింగ్ ఉంటుందని అనుచరులకు ముద్రగడ పద్మనాభం క్లారిటీ ఇచ్చారు. మొదట ముద్రగడ జనసేనలో చేరాలనుకున్నారు. అయితే ముద్రగడ ఇంటికి వస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. రోజులు, వారాలు, నెలలు గడిచినా వెళ్లలేదు. ఇలా రెండుమూడు సార్లు ఇంటి వద్దకు వస్తానని చెప్పి అవమానించారని జనసేనానిపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి వద్దకు రావాలంటే ఇతరుల అనుమతి అవసరమని పరోక్షంగా చంద్రబాబు గురించి ముద్రగడ ప్రస్తావించారు.