కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని అన్నారు. పాపం చేస్తే పాపం, పుణ్యం చేస్తే పుణ్యం వస్తుందని అన్నారు. కర్మ సిద్దాంతం ప్రకారం చేసిన పాపాలకు ఫలితం రాహుల్ గాంధీ అనుభవిస్తున్నారన్నారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా నేషనల్ హెరాల్డ్ కేసు తెర మీదుకి వచ్చిందని గుర్తు చేశారు. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించి కక్ష సాధింపుగా ఆరోపించడం సరికాదని బీజేపీకి మద్దతుగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.
మూడో రోజు విచారణకు రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ మనీ-లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మూడో రోజు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో దాదాపు 20 గంటల పాటు రాహుల్‌ను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ స్టేట్మెంట్‌ను ఈడీ రికార్డు చేస్తోంది. కాగా రాహుల్ సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
తమ నేతపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. సోమవారం నుంచి ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడే నిలువరిస్తున్నారు.