బండి సంజయ్‌కు రోహిత్‌రెడ్డి సవాల్
MLA Rohit Reddy challenge to Bandi Sanjay.బండి సంజయ్‌కు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు.
By తోట వంశీ కుమార్
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం చార్మినార్‌లోని భాగలక్ష్మీ అమ్మవారిని రోహిత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్నారు.
తనపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. రేపు ఇదే సమయానికి మళ్ళీ ఇక్కడికే వస్తానని, డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని బండి సంజయ్ నిరూపించాలని ఆయన సవాలు విసిరారు. ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నట్లు చెప్పారు. నిరూపించకపోతే ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) తనకు నోటీసులిస్తుందన్న విషయం బండి సంజయ్‌కు ముందే ఎలా తెలిసిందని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ప్రజలు బీజేపీ తీరును గమనించాలన్నారు. ఎదురించిన వారికి ఈడీ నోటీసులు ఇస్తూ వేధిస్తుందన్నారు. డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని, కర్ణాటక పోలీసులు నుంచి కూడా తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు.
కాగా.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నుంచి నోటీసులు అందిన విషయం తెలిసిందే.