బీజేపీలోకి ఈటల.. త్వరలోనే బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ..!
MLA Etal Rajender ready to join in BJP.తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ త్వరలో బీజేపీ గూటికి చేరుతున్నారంటూ వస్తున్న వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 27 May 2021 5:17 AM GMT
తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ త్వరలో బీజేపీ గూటికి చేరుతున్నారంటూ వస్తున్న వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఈటల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. గురువారమే ఈ భేటి జరగనుందనే ప్రచారము ఉంది. ముందే ప్రకటించిన విలేకరుల సమావేశాన్ని అందుకే రద్దు చేసుకున్నారని అంటున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మరో మూడు నుంచి నాలుగు రోజుల్లోనే చేరిక ఉంటుందని భాజాపా వర్గాలు చెబుతున్నాయి. ఈటలతోపాటు కామారెడ్డి జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే ఆయన తన అనుచరులతో భేటి అవుతున్నారు. బుధవారం నాడు హుజూరాబాద్ నియోజకవర్గంలోని తన అనుచరులతో ఈటల రాజేందర్ భేటి అయ్యారు. ఈ రోజు కూడా మరోసారి అనుచరులతో భేటి కానున్నారు. తనతో కలిసి వచ్చే నేతలతో తన రాజకీయ భవిష్యత్తు గురించి ఈటల రాజేందర్ వివరిస్తున్నారు. ఈటల.. ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలను కలిసి వచ్చిన తరువాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు.
బీజేపీ కీలక నేతలతో గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్న ఈటల నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ ఛుగ్, తెలంగాణ చీఫ్ బండి సంజయ్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన ఆరెస్సెస్ కీలక నేతలతోనూ ఈటల సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అయితే.. ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్, బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించారు. అయితే.. కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రాలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే.. మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని బీజేపీ నాయకత్వం తేల్చి చెప్పింది. దీంతో బీజేపీలో చేరితే ఎలా ఉంటుందనే విషయమై అనుచరులతో చర్చలు జరుపుతున్నారు.